జగన్‌‌కు అప్రతిష్ట తెస్తోన్న సొంత ఎమ్మెల్యేలు!

కరోనా మహమ్మారిని ఎదుర్కొని, కట్టడి చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది. ప్రజా ప్రతినిధులంతా ప్రజలకు అండగా నిలిచేందుకు, వారిలో ధైర్యం నింపేందుకు కార్యక్రమాలు చేపడుతున్నారు. అయితే ఇక్కడే వారు పొరపాట్లు చేస్తున్నారు. అత్యుత్సాహం, అనాలోచిత చర్యల వల్ల మొత్తం పార్టీకే అప్రతిష్ట తెస్తున్నారు.

లాక్ డౌన్ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను, వలస కూలీలను ఆదుకునేందుకు, వారికి ఆహారం, వసతి సౌకర్యాలు కల్పించేందుకు అహర్నిశలూ శ్రమిస్తోంది. ప్రజలు బైటికి రావద్దంటూ పెద్ద ఎత్తున ప్రచారాలు చేస్తోంది. అయితే వైకాపాకు చెందిన కొందరు ఎమ్మెల్యేలు మంచి చేయబోయి అపవాదులను మూటగట్టుకుంటున్నారు. తాజాగా నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలో 30 ట్రాక్టర్ల నిత్యావసర సరుకుల లోడులతో, జనాలతో వైకాపా నేత ర్యాలీ నిర్వహించడం కలకలం రేపింది. దీంతో బాధ్యతగా మెలగాల్సిన నేతలే స్వయంగా కరోనా వాహకాలుగా మారుతున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఇక చిత్తూరు జిల్లా పలమనేరు స్థానిక ఎమ్మెల్యే ఓ వంతెన కార్యక్రమంలో పాల్గొని లాక్ డౌన్ నిబంధనలు అతిక్రమించారు. అలాగే శ్రీకాళహస్తి లోకల్ ఎమ్మెల్యే మధుసూధన్ రెడ్డి ఊరేగింపు వల్ల ఉద్యోగులు సైతం కరోనా బాధితులయ్యారు. పదుల సంఖ్యలో కేసులు ఒక్కసారిగా పెరిగిపోవడానికి కారణమయ్యారు.

ఇక తాజాగా నగరి ఎమ్మెల్యే రోజా తాగునీటి బోరు ప్రారంభోత్సవం ద్వారా కూడా ఇలాంటి విమర్శలే ఎదుర్కొన్నారు. గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే ముస్తఫా కూడా ఓ విందు ద్వారా అప్పట్లో హాట్ టాపిక్ అయ్యారు. వారి కుటుంబ సభ్యులు, సెక్యూరిటీ గార్జులు సహా క్వారెంటైన్లో గడిపారు. ఇలా అధికార పార్టీకి చెందిన కొందరు ఎమ్మెల్యేలు చేసిన పనుల వల్ల జగన్ ప్రభుత్వం అప్రతిష్టను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇప్పటికైనా ప్రజా ప్రతినిధులు ఇలాంటి వాటికి దూరంగా.. ప్రజలకు సాయం చేసేందుకు వాలెంటీర్లు, ఇతర వ్యవస్థలను ఉపయోగించుకుంటే మంచిది. లేదంటే.. మంచి చేయాలని చూసినా చెడునే ఎదురవుతుంది.