కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఏపీ ముఖ్యమంత్రి జగన్‌కు ఫోన్ చేశారు. రాష్ట్రంలో లాక్‌డౌన్ పరిణామాలు, ప్రస్తుత పరిస్థితులు, కర్నూలు వంటి జిల్లాల్లో కేసుల సంఖ్య పెరగడం, ర్యాపిడ్ కిట్ల కొనుగోలు వంటి అనేక అంశాలపై జగన్ అమిత్ షాకు వివరించడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
అమిత్ షా ఏపీలో కరోనా వైరస్ కట్టడికి తీసుకుంటున్న చర్యలను అడిగి తెలుసుకున్నట్లు జగన్ తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో కరోనా నిర్ధారణ పరీక్షలు వేగవంతం చేయడం, ప్రతి మిలియన్ జనాభాకు అత్యధిక కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించిన రాష్ట్రంగా ఏపీ తొలి స్థానంలో నిలవడం వంటి అంశాలను జగన్ తెలిపారు.
గుంటూరు, కృష్ణా, కర్నూలు జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరగడంపై అమిత్‌షా ఆరా తీయగా ప్రస్తుతం తీసుకుంటున్న చర్యలపై జగన్ తెలిపారు. అలాగే గుజరాత్‌లో చిక్కుకుపోయిన తెలుగు మత్స్యకారులను రప్పించడంపై కూడా జగన్ అమిత్ షాతో చర్చించారు. మొత్తంగా రాష్ట్రంలో పరిస్థితుల పట్ల అమిత్ షా సంతృప్తిని వ్యక్తం చేసినట్లు సమాచారం. దీనితో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం మధ్య సంబంధాలు బలంగానే ఉన్నాయన్న వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి.