అసెంబ్లీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ కుటుంబానికి అధికారులు మరో షాక్ ఇచ్చారు. మాజీ స్పీకర్ కొడుకు కోడెల శివరామ కృష్ణకు ఉన్న మోటారు సైకిల్ షో రూములో అక్రమాలు బయటపడటంతో దాని లైసెన్సులు రద్దు చేశారు. శివరామ్ కు సత్తనపల్లి, గుంటూరు, నరసరావుపేట లో టూ వీలర్ షో రూములున్నాయి. అయితే ఆ షోరూముల్లో విక్రయించిన మోటారు సైకిళ్ళ విషయంలో భారీగా అక్రమాలు జరిగినట్లు రవాణా శాఖ గుర్తించింది.
2018-19లో పై షో రూముల్లో 10, 276 మోటారు సైకిళ్ళను అమ్మగా 2019-20 ఆగష్టు 2వ తేదీ నాటికి 2,912 వాహనాలను అమ్మింది. అయితే ఇందులో 1025 వాహనాలకు సంబంధించి తాత్కాలిక రిజిస్ట్రేషన్, జీవితకాల పన్ను, పర్మినెంట్ రిజిస్ట్రేషన్, సర్వీసు ఛార్జీలను ప్రభుత్వానికి చెల్లించలేదు.
అంటే అధికారుల అంచనా ప్రకారం ప్రతీ వాహనం అమ్మకంలో సుమారుగా రూ. 5 వేలు అక్రమంగా శివరామ్ వెనకేసుకున్నారు. ఇలా ఎక్కడికక్కడ అందినకాడికి దోచుకోవటానికి అలవాటు పడ్డ కొడుకు, కూతురు తమ అరాచకాలను ఐదేళ్ళు యధేచ్చగా సాగించారు. దాంతో కుంటుంబం మొత్తం నియోజకవర్గాల్లో కాకుండా బయట కూడా గబ్బు పట్టిపోయింది.
ఈ నేపధ్యంలోనే అసెంబ్లీ ఫర్నీచర్ దొంగతనం బయటపడటంతో ఉన్న కొద్దొ గొప్పో పరువు కూడా పాతాళానికి దిగజారిపోయింది. ఇటువంటి సమయంలో షో రూముల లైసెన్సులను రద్దు చేస్తున్నట్లు రవాణా శాఖ అధికారులు ప్రకటించటం గోరు చుట్టుపై రోకటి పోటు పడటమనే చెప్పాలి. సమస్యల్లో నిండా ముణిగిపోయిన కోడెల కుటుంబం ఎలా బయటపడుతుందో చూడాల్సిందే