కన్నా లక్ష్మీనారాయణను తప్పించేందుకే ఆ ఎత్తుగడ!?

Kanna Lakshmi Narayana

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న కన్నా లక్ష్మీనారాయణ వైకాపా కోవర్టు అన్న వార్తలు వచ్చాయి. త్వరలో కన్నా బీజేపీని వీడి వైకాపా తీర్థం పుచ్చుకుంటున్నారు అని కూడా టాక్ వినబడింది. కానీ ఏం జరిగిందో గానీ.. ఇప్పుడు కన్నాను రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవి నుంచి తప్పించేందుకు వైకాపా ప్రయత్నిస్తోందని పుకార్లు షికారు చేస్తున్నాయి. స్వయంగా జగన్ ఈ మేరకు బీజేపీ పెద్దలతో పరిచయాలు ఉన్న వైకాపా ఎంపీలను పురమాయించారని ఆ పార్టీ నేతలే వ్యాఖ్యలు చేస్తున్నారు.  

రాజధాని వికేంద్రీకరణ అంటూ ముఖ్యమంత్రి జగన్ ప్రకటించిన తర్వాత ప్రతిపక్ష టీడీపీతోపాటు బీజేపీ నుండి కూడా పెద్ద ఎత్తున విమర్శలు ఎదురయ్యాయి. అందులోనూ ముఖ్యంగా కన్నా లక్ష్మీనారాయణ అయితే అభివృద్ది వికేంద్రీకరణకు మద్దతిస్తాం కానీ.. పరిపాలనకు కాదు అంటూ తన పంథాను తేల్చేశారు. రాజధాని విషయంలో జగన్‌పై తీవ్ర విమర్శలు చేశారు. జగన్‌ను శంకర్ దాదా అని ఎద్దేవా చేశారు. అలాగే స్థానిక ఎన్నికల వాయిదా విషయంలోనూ ఎన్నికల కమిషన్ నిర్ణయాన్ని గట్టిగా సమర్థించారు. అయితే ఈ తంతంగం వెనుక ఉన్న అసలు వ్యక్తి కన్నానే అన్న అనుమానాలు కూడా వైకాపా నేతలకు ఉన్నట్లు ఉన్నాయి. అందుకే వైకాపా ఎంపీ విజయ్ సాయి రెడ్డి సైతం కన్నాపై ట్విట్టర్ వేదికగా తీవ్ర ఆరోపణలు చేశారు. కన్నా లాంటి వారు ఉంటే రాష్ట్రం నాశనం అవుతుందని కూడా అన్నారు.

కేవలం విమర్శలు చేయడంతోనే ఆగిపోలేదు.. వైకాపా సీనియర్ ఎంపీలు ఇప్పుడు బీజేపీ పెద్దల దగ్గర కన్నాను తొలగించడంపై ప్రస్తావించారట. ప్రతిపక్ష టీడీపీకి మద్దతిస్తోన్న కన్నాను ఇంకా అదే పదవిలో కొనసాగిస్తే.. భవిష్యత్తులో ప్రతిపక్షానికి మరింత బలం చేకూరుతుందని భావించే ఈ దిశగా కసరత్తు చేస్తున్నారట. అయితే అది అంత త్వరగా పూర్తయ్యే కార్యక్రమంలా కనిపించడంలేదు. స్థానిక ఎన్నికలు పూర్తైన తర్వాత రాష్ట్రంలో పరిస్థితులను బట్టి అప్పుడు ఆలోచించొచ్చు అనే యోచనలో బీజేపీ ఉన్నట్లుంది. కాబట్టి ఈ విశయంలో వైకాపా కొద్ది కాలం వేచి చూడక తప్పేలా లేదు.