ఆంధ్రప్రదేశ్‌‌‌ ఆదాయం రూ.2 కోట్లు కూడా లేదు!

కరోనా మహమ్మారి ప్రజల ప్రాణాలతోనే కాదు రాష్ట్ర ఆర్థికను సంక్షోభంలోకి నెట్టింది. ఓ వైపు ఆదాయం లేకపోవడం..కరోనా కట్టడికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల ఖర్చులు వెరసి ఇప్పటికే ఖజానా ఖాళీకాగా.. ఉద్యోగులకు జీతాలు ఇచ్చే స్థితిలో కూడా ప్రభుత్వం లేదని స్పష్టమైంది. అందుకే మార్చి నెల జీతాన్ని రెండు దఫాలుగా ఇచ్చేలా నిర్ణయం తీసుకుంది.

లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఆర్థిక పరిస్థితులు బాగా లేని కారణంగా.. ఉద్యోగుల జీతాల్లో కోత విధించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. కేవలం ఆర్థిక ఇబ్బందుల కారణంగా మాత్రమే రెండు దఫాలుగా మార్చి జీతం ఇవ్వనుంది. అయితే ఇది విరాళం కాదు, జీతం లో కోత కాదు.. కేవలం సగం జీతం ఇప్పుడిచ్చి మిగతా జీతం తర్వాత ఇవ్వనున్నారు. ఈ సందర్బంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు సూర్యనారాయణ.. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరి తరపున సహకరిస్తామని అన్నారు. అలాగే లాక్ డౌన్ కారణంగా రోజుకి రెండు కోట్ల రూపాయల ఆదాయం కూడా రాని పరిస్థితి నెలకొందని సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఇప్పటికే ధనిక రాష్ట్రం తెలంగాణ సైతం.. ఉద్యోగులు, ప్రజా ప్రతనిధుల జీతాల్లో కోతలు విధించగా.. మహారాష్ట్ర సైతం అదే బాట పట్టింది. తెలంగాణ లాంటి ధనిక రాష్ట్రమే ఈ సంక్షోభం నుండి గట్టెక్కలేకపోతే ఇక పేద రాష్ట్రం, ఆదాయం అంతంత మాత్రంగానే ఉన్న ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులు ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు.