మొత్తనికి ఏపీలోని బీజేపీపై కేంద్రంలోని కమలదళం కదిలింది. ఇక్కడ లీడర్‌కో నినాదం…. నాయకుడికో విధానం పెట్టుకుని వ్యవహరిస్తుండడంతో అంతిమంగా పార్టీకి తీరని నష్టం జరుగుతుందని ఆ పార్టీ అధిష్ఠానం గుర్తించందని సమాచారం. దాంతో ఇక పార్టీ లైన్‌కు భిన్నంగా వ్యవహరించే నేతలను కట్టడి చేయకుంటే అంతంత మాత్రం బలం ఉన్న ఈ రాష్ట్రంలో పూర్తిగా పుట్టి మునగడం ఖాయమని నిర్ణయానికి వచ్చిన బీజేపీ పెద్దలు రాష్ట్రంలోని నాయకత్వానికి బ్రెయిన్ వాష్ చేశారని సమాచారం. ఇకపై రాష్ట్రంలో పార్టీ అధ్యక్షుడు ఏ నిర్ణయం తీసుకుంటే దానికే అందరూ కట్టుబడి మాట్లాడాలని ఎవరికి తోచినట్లు వారు మాట్లాడితే కఠిన చర్యలు తప్పవని తేల్చి చెప్పారు.
నిజానికి కొన్నాళ్లుగా ఏపీలోని పరిణామాలు, ముఖ్యంగా రాజధాని అమరావతి తరలింపు వ్యవహారంపై ఏపీలోని బీజేపీ నేతలు తలొ దిక్కు అన్నట్లు వ్యవహరిస్తున్నారు. దానితో బీజేపీలో ఉన్న గందరగోళంపై రాష్ట్ర ప్రజలలో కూడా తీవ్ర అసంతృప్తి నెలకొంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ, ఆ పార్టీ ఎంపీ సుజనా చౌదరి వంటి నేతలు అమరావతి తరలింపును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అయితే, రాష్ట్రానికి చెందిన మరో నేత వేరే రాష్ట్రం నుంచి రాజ్యసభ సభ్యునిగా ఉన్న వ్యక్తి మాత్రం అమరావతి తరలింపు వ్యవహారంలో జగన్ ప్రభుత్వానికి మద్దతుగా వ్యాఖ్యలు చేస్తూ గందరగోళం సృష్టిస్తున్నారు. దాంతో ఆయనపై బీజేపీ నేతలు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంటుకు ఫిర్యాదు చేశారు.
దాంతో రంగంలోకి దిగిన పార్టీ పెద్దలు ఏపీలోని పరిస్థితిని చక్కదిద్దే పని చేపట్టారని సమాచారం. ఆ మేరకు ఇకపై “పార్టీ రాష్ట్ర అధ్యక్షుడే ఫైనల్. ఆయన ఏమి చెబితే అది వినాల్సిందే. అందుకు భిన్నంగా జరిగితే ఊరుకునేది లేదు. ప్రభుత్వం తీసుకునే ప్రజావ్యతిరేక నిర్ణయాలను ప్రజాబాహుళ్యంలో ఎండగట్టాల్సిందే. పార్టీ ఏకగ్రీవ తీర్మానానికి అందరూ కట్టుబడి ఉండాల్సిందే అనే తీర్మానాన్ని చేసి దానిని అందరూ విధిగా పాటించాలని తేల్చి చెప్పారట. దాంతో బీజేపీలోనే ఉంటూ జగన్‌కు అనుకూలంగా వ్యవహరిస్తున్న వారి నోటికి తాళం పడిందని చెబుతున్నారు. ఇటీవల సదరు నేతలు చేస్తున్న వ్యాఖ్యలతో ఈ విషయం వాస్తవమేనని రూఢీ అయిందని బీజేపీ కింది స్థాయి కేడర్ లో చర్చలు సాగుతున్నాయి.
మొన్నటి వరకూ రాజధాని తరలింపుపై కన్నా, సుజనా వంటి వారి వ్యాఖ్యలకు కౌంటర్‌లు ఇస్తున్న కొందరు బీజేపీ నేతలు ఇప్పుడు సైలెంట్ అయ్యారని పైగా రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు కూడా చేస్తున్నారని బీజేపీలోనే చర్చలు సాగుతున్నాయి. ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల వాయిదా విషయంలో సదరు సీఎం జగన్ అనుకూల బీజేపీ నేతలు కూడా వైసీపీపై విమర్శలు గుప్పించిన సంగతిని పార్టీ శ్రేణులు గుర్తు చేస్తున్నాయి. పైగా, రాజధానిగా అమరావతి కొనసాగాల్సిందేననీ, పరిపాలనా వికేంద్రీకరణకు బీజేపీ వ్యతిరేకమనీ, అభివృద్ధి వికేంద్రీకరణను పార్టీ సమర్ధిస్తుందనీ స్పష్టత ఇచ్చారట. ఈ తీర్మానానికి అందరూ కట్టుబడి ఉండాల్సిందేనని కేంద్ర పార్టీ బాధ్యులు తేల్చిచెప్పినట్లు సమాచారం.