హుజూర్ నగర్ ఉప ఎన్నిక యుద్ధం మొదలైపోయినట్లే. సోమవారంతో నామినేషన్ల ఘట్టం కూడా ముగిసింది కాబట్టి బరిలో ఉండే అభ్యర్ధులెవరో తేలిపోయింది. నాలుగు ప్రధాన పార్టీల అభ్యర్ధులు రంగంలో ఉండంటతో గెలుపోటములపై అందరిలోను ఉత్కంఠ పెరిగిపోతోంది. అయితే ఇక్కడ సెటిలర్ల ఓట్లే కీలకమని అర్ధమైపోతోంది.
నిజానికి కాంగ్రెస్ ఎంఎల్ఏగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎంపిగా గెలవటంతో ఉప ఎన్నిక అవసరమైంది. కాబట్టి న్యాయబద్ధంగా అయితే ఈ సీటు కాంగ్రెస్ దనే చెప్పాలి. కానీ ఈ సీటులో ఇప్పటి వరకూ టిఆర్ఎస్ గెలిచింది లేదు. అందుకనే సర్వశక్తులు ఒడ్డయినా సరే ఉప ఎన్నికలో గెలవాలని పట్టుదలగా ఉంది.
అదే సమయంలో మొన్నటి పార్లమెంటు ఎన్నికల్లో నాలుగు సీట్లు గెలిచిన బిజెపి కూడా మంచి ఊపుమీదుంది. అస్తిత్వం నిరూపించుకునేందుకు టిడిపి కూడా రంగంలోకి దిగటంతోనే మిగిలిన మూడు పార్టీలకు సమస్య పెరిగిపోయింది. సెటిలర్ల ఓట్లను కొల్లగొట్టటమే టార్గెట్ గా పెట్టుకుని టిడిపి ఇక్కడ పోటిలోకి దూకింది.
టిడిపి వ్యూహం తెలియగానే అందరి కళ్ళు ఇపుడు సెటిలర్ల ఓట్లపైనే పడింది. నియోజకవర్గంలోని సుమారు 2.3 లక్షల ఓట్లలో సెటిలర్ల ఓట్లే సుమారు 50 వేలుంటాయి. మరి ఇవన్నీ ఎవరికి పడతాయో తెలీక అందరిలోను టెన్షన్ మొదలైంది. పోయిన ఎన్నికల్లో కాంగ్రెస్+టిడిపి కలిసే ఉన్నాయి కాబట్టి ఉత్తమ్ గెలిచారు. మరి ఈ సారి ఏమవుతుందో చూడాల్సిందే.