మొన్ననే రాష్ట్ర ఎన్నికల కమిషన్ తీసుకున్న నిర్ణయంపై సుప్రీం కోర్టుకు వెళ్లిన ముఖ్యమంత్రి జగన్ సర్కారుకు అక్కడ ఎదురు దెబ్బ తప్పలేదు. అది మరువక ముందే మరోసారి దేశ సర్వోన్నత న్యాయ స్థానం నుంచి వైపీపీ ప్రభుత్వానికి మరో షాకింగ్ న్యూస్ తప్పలేదు. సేమ్ టూ సేమ్ తెలంగాణలోని కేసీఆర్ సర్కారు మాదిరే ఏపీలోని జగన్ ప్రభుత్వానికి కూడా ఉన్నత న్యాయ స్థానాల నుంచి ఎదురు దెబ్బలు తప్పడం లేదు. పదే పదే అవే తప్పలు చేస్తూ కోర్టులతో మొట్టి కాయలు వేయించుకుంటూనే ఉన్నారు.
తెలంగాణలో కేసీఆర్ సర్కారు కూడా సచివాలయం మార్పు నుంచి నిన్నటి ఆర్టీసీ కార్మికుల సమ్మె వరకూ ప్రతి విషయంలోనూ అక్కడి హైకోర్టుతో చివాట్లు తిన్న సంగతి తెలిసిందే. ఇక ఏపీలో కొత్తగా ప్రభుత్వ పగ్గాలు చేపట్టిన ముఖ్యమంత్రి జగన్ కూడా కేసీఆర్ ఆశీస్సులతోనూ పాలన సాగిస్తున్నారన్న అభిప్రాయం, ఆయన సలహాలు సూచనలు తప్పక పాటిస్తారన్న వాదనలు వినిపిస్తున్న తరుణంలో ఏపీ సర్కారుకు కూడా పదే పదే కోర్టులతో మొట్టికాయలు వేయించుకోవడం పరిపాటిగా మారిందన్న విమర్శలున్నాయి.
ఇక, మొన్ననే ప్రభుత్వ కార్యాలయాలు, భవనాలకు వైసీపీ రంగులు వేయడాన్ని రాష్ట్ర హైకోర్టు తప్పుబట్టిన సంగతి తెలిసిందే. 10 రోజుల్లో ఆ రంగులు తొలగించి ఏ పార్టీకి అనుకూలంగా ఉండని రంగులు వేసి సదరు నివేదికను తమకు సమర్పించాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీనిపై వైసీపీ ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వెళ్లింది. ఇప్పుడు సుప్రీం కోర్టు కూడా హైకోర్టు తీర్పునే సమర్థించింది. పంచాయతీ కార్యాలయాలకు వైసీపీ రంగులు వేయడంపై హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్ధించింది. సత్వరమే రంగులు తొలగించాలంటూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ కార్యాలయాలకు వైసీపీ రంగులు వేయడంపై హైకోర్టులో జరిగిన విచారణలో భాగంగా.. గ్రామ సచివాలయ భవనాలకు రాజకీయ పార్టీల రంగులు తొలగించాలని ఆదేశించింది. పంచాయతీ భవనాలు, ప్రభుత్వ భవనాలకు సీఎస్ నిర్ణయం ప్రకారం పది రోజుల్లో మళ్లీ రంగులు వేయాలని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.