వైజాగ్లో మరో గ్యాస్ లీక్ దుర్ఘటన.. ఇద్దరు మృతి

vizag pharma gas leak
ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ ఘటన ఇంకా మరపుకు రాకముందే వైజాగ్లో మరో గ్యాస్ లీక్ ఘటన చోటు చేసుకుంది.  ఈరోజు మంగళవారం తెల్లవారుఝామున పరవాడ ఫార్మా సిటీలో సాయినార్ కెమికల్స్ నుండి గ్యాస్ లీకైంది.  ఈ దుర్ఘటనలో ఇద్దరు మృతి చెందగా మరో నలుగురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.  మృతులు షిఫ్ట్ ఇన్ఛార్జ్ నరేంద్ర, కెమిస్ట్ గౌరీ శంకర్ గా గుర్తించారు.  అస్వస్థతకు గురైన వారు చంద్రశేఖర్, ఆనందబాబు, జానకీరావు, సూర్యనారాయణరావుగా గుర్తించారు.  ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందట. 
 
ప్రమాద విషయం తెలుసుకున్న వెంటనే కలెక్టర్ వినయ్‌ చంద్‌, నగర పోలీస్‌ కమిషనర్‌ ఆర్కే మీనా ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు.  రియాక్టర్ నుండి బెంజిన్ మెడిజోన్ గ్యాస్ లీకవడంతోనే ఈ ప్రమాదం జరిగినట్టు ప్రాథమిక అంచనాకు వచ్చారు.  అధిక మొత్తంలో గ్యాస్ లీక్ కాకపోవడం వలన చుట్టుపక్కల ప్రాంతాల్లోని ప్రజలు ఆందోళన పడాల్సిన పనిలేదని అధికారులు చెబుతున్నారు.  ఘటనపై పూర్తిస్థాయి విచారణకు కలెక్టర్ నలుగురు అధికారులతో కమిటీ వేశారు. 
 
ఎల్జీ పాలిమర్స్ ఘటన జరిగిన కొన్నాళ్లకే ఇలా మరో గ్యాస్ లీక్ ప్రమాదం జరగడంతో ప్రతిపక్షాలు విమర్శలకు రెడీ అయ్యాయి.  ఒకసారి పెద్ద ప్రమాదం జరిగితే పొరపాటు అనుకోవచ్చు, కానీ రెండోసారి జరిగితే ఖచ్చితంగా తప్పేనని, ఎల్జీ పాలిమర్స్ ఘటన అనంతరం ప్రభుత్వం అప్రమత్తమై వైజాగ్లోని అన్ని రకాల పరిశ్రమల్లోని భద్రతా వ్యవస్థల మీద పరిశీలన చేపట్టి ఉంటే ఇప్పుడు ఈ ఘటన జరిగి ఉండేది కాదని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు.  ఇక వైజాగ్ వాసులైతే ప్రభుత్వం ప్రమాదం జరిగాక నష్ట పరిహారం ఇవ్వడం కాదని అసలు ప్రమాదాలు జరగకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.