కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు దేశం మొత్తం ఏకతాటిపై నిలిచి పోరాడుతోంది. ప్రణాళికలతో కరోనా కట్టడికి కేంద్రం అన్నీరాష్ట్రాల్లో లాక్ డౌన్ నిర్ణయం తీసుకుంది. అందుకు అనుగుణంగా రాష్ట్రాలు సైతం లాక్ డౌన్ ను పూర్తిస్థాయిలో అమలు చేసేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నాయి. కష్టమైనా ప్రజలు తప్పనిసరిగా ఇళ్లలో ఉండాలని పదే పదే చెబుతున్నాయి. నయాబా, భయానా ప్రమాదాన్ని ఆపే ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇక తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎవరైనా సహకరించకుండా, పౌర సమాజానికి హాని తలపట్టేలా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరికలు చేశారు. ఇక అంతరాష్ట్ర సరిహద్దులను రెండు తెలుగు రాష్ట్రాలు మూసేశాయి. అయితే ఇక్కడే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయ లోపంతో వేలాది మంది ఆంధ్ర విద్యార్థులు, ప్రజలు ఆంధ్రప్రదేశ్ బార్డర్ల వద్ద పడిగాపులు పడాల్సి వచ్చింది. పర్మిషన్ కోసం వేచి చూడాల్సిన పరిస్థితి తలెత్తింది. అయితే రాష్ట్రంలో కరోనా వ్యాప్తి చెందకుండా తీసుకున్న నిర్ణయాల వల్ల హైదరాబాద్ నుండి స్వస్థలాలకు వస్తోన్న వారికి అడ్డంకి ఏర్పడింది. 14 రోజులు క్వారెంటైన్లో ఉన్న తర్వాతే వారి వారి ఊళ్లకు పంపిస్తామని చెప్పింది. ఇది కాస్త కఠినంగా ఉన్నా తప్పని సరి పరిస్థితి. వేలాది మంది ఒక్కసారిగా రాష్ట్రంలోకి వచ్చేస్తే వారిలో కరోనా పాజిటివ్ ఉన్న వారు కూడా ఉంటే.. పరిస్థితులు ఒక్కసారిగా అదుపుతప్పుతాయి. అందుకే ప్రభుత్వానికి ఇది తప్పని సరి నిర్ణయం. ఇక చివరికి రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు దీనిపై మాట్లాడుకుని నిర్ణయం తీసుకోవడం, ఏపీ విద్యార్థుల బాధ్యతను కేసీఆర్ తనదే చెప్పడం జరిగిపోయింది.
అయితే ఇక్కడే ఓ మంత్రిగా పనిచేసిన లోకేష్‌కు వీటి గురించి తెలియలేదా అన్నదే ఇప్పుడు విమర్శలకు దారితీస్తోంది. హైదరాబాద్‌లో ఉంటోన్న ఆయన.. ఆంధ్రప్రదేశ్ విద్యార్థులను ఆంధ్రప్రదేశ్‌లోకి రానివ్వడం లేదంటూ విమర్శలు చేయడం బాధ్యతా రాహిత్యానికి అద్దం పడుతోందని అధికార పార్టీ నేతల నుండి ఆగ్రహం వ్యక్తం అవుతోంది. విద్యార్థుల బాధను ఎవరూ కాదనలేరు, కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఏ మాత్రం అదుపు తప్పినా ఫలితాలు చాలా భయానకంగా ఉంటాయన్నది కేంద్ర ప్రభుత్వం చెప్పకనే చెబుతోంది. ఇక ఇటలీ ఉదాహరణ ఉండనే ఉంది. మరి ఇలాంటి విపత్కర సమయాల్లో అయినా నేతలు రాజకీయాలు మాని.. ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఎలా రాష్ట్ర ప్రజలను కాపాడుకోవాలి అన్నదానిపైన దృష్టి పెడితే బాగుంటుందని ప్రతిపక్ష నేతలకు అధికార పక్షం హితవు పలుకుతోంది.