పార్లమెంటు నుండి టిడిపి ఔట్ ?

పార్లమెంటు నుండి తెలుగుదేశంపార్టీని బయటకు పంపేశారా ? కేంద్రంలోని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి తీసుకున్న తాజా నిర్ణయంతో అందిరిలోను ఇదే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పార్లమెంటు భవనంలో ప్రతీ పార్టీకి వాటి సంఖ్యాబలం ప్రకారం కార్యాలయ గదులు కేటాయిస్తుంటారు. తాజాగా టిడిపి కార్యాలయం గదేమీ కేటాయించ లేదు. దాంతో అందరిలోను అనుమానాలు పెరిగిపోతున్నాయి.

పార్లమెంటులోని పార్టీల ప్రాతినిధ్యం ప్రకారమే పై అంతస్తు నుండి గదులు కేటాయిస్తుంటారు. అదే పద్దతిలో టిడిపికి ప్రస్తుం గ్రౌండ్ ఫ్లోర్లోని 5వ నెంబర్ గదిని కార్యాలయంగా కేటాయించారు. అయితే ఈ గదిని ప్రస్తుతం వైసిపికి కేటాయించారు. ఇదే గదిలో  సెంటిమెంటుగా టిడిపి దాదాపు 1989 నుండి కంటిన్యు అవుతోంది. పర్వతనేని ఉపేంద్ర కేంద్రమంత్రిగా ఉన్నప్పటి నుండి మొన్నటి 2019 ఎన్నికల వరకూ టిడిపికి పార్లమెంటు సచివాలయం ఇదే గదిని కేటాయిస్తున్న విషయం అందరికీ తెలిసిందే.

అయితే మొన్నటి ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత టిడిపి పరిస్ధితి తల్లకిందులైపోయింది.  అసెంబ్లీలోనే అనుకుంటే దాని ప్రభావం పార్లమెంటు భవనంలో కూడా కనబడింది. టిడిపికి సెంటిమెంటుగా ఉన్న గది ఇపుడు వైసిపి సొంతమైంది. ఎంపిల ప్రాతినిధ్యం ఆధారంగా 14 పార్టీలకు అధికారులు గదులు కేటాయించారు. టిడిపి చేతిలో ఉన్న గదిని వైసిపికి కేటాయిస్తు ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయి.

సరే టిడిపి గదిని వైసిపికి కేటాయించటం వరకూ బాగానే ఉంది. మరి టిడిపికి ఏదో ఓ గదిని కేటాయించాలి కదా ? లోక్ సభలో ముగ్గురు, రాజ్యసభలో ఇద్దరు సభ్యులున్నారు టిడిపికి. అటువంటిది కార్యాలయంగా ఏ గదిని కేటాయించినట్లు సమాచారం ఇవ్వకపోవటంతో టిడిపిలో అయోమయం మొదలైంది. మరి పార్లమెంటు సచివాలయం చివరకు ఏం చేస్తుందో చూడాల్సిందే.