పాపం టిడిపి అభ్యర్ధి

చంద్రబాబునాయుడు ఎప్పుడూ ఇంతే. నమ్ముకున్న వాళ్ళను దెబ్బ కొట్టటమే టార్గెట్ గా చంద్రబాబు పావులు కదుపుతుంటారు. తాజాగా నల్గొండ జిల్లా హుజూర్ నగర్ ఉప ఎన్నిక విషయమే ఉదాహరణగా నిలుస్తోంది. గెలుపు అవకాశం ఎటూ లేదు. ఆ విషయం తెలిసి కూడా ఉపఎన్నికలో అభ్యర్ధిని దింపాలని చంద్రబాబు డిసైడ్ అయ్యారు. అందుకని చావా కిరణ్మయిని రంగంలోకి దింపారు.

ఏ కారణాలతో కిరణ్మయిని పోటిలోకి దింపారన్న విషయాన్ని పక్కనపెడితే ఇప్పటి వరకూ నియోజకవర్గంలో ప్రచారానికి చంద్రబాబు కానీ చినబాబు కానీ అడుగు కూడా పెట్టలేదు. టిడిపి తరపున పోటి చేసిన వాళ్ళల్లో ఎవరికైనా నాలుగు ఓట్లు పడతాయంటే అది చంద్రబాబును చూసే అన్న విషయం స్పష్టం. లేకపోతే చంద్రబాబు మ్యానేజిరల్ స్కిల్స్ వల్లే పది ఓట్లు పడాలి.

ఈ విషయంలో చంద్రబాబుకు కూడా మంచి క్లారిటీ ఉంది. అయితే అన్నీ విషయాలు తెలిసి కూడా ఇంతవరకూ ఎందుకు నియోజకవర్గంలో ప్రచారానికి దిగలేదు ?  ఇదే అభ్యర్ధితో పాటు ఆమె మద్దతుదారులను కలవరపెడుతోంది. ఈ నెల 21వ తేదీన పోలింగ్ జరగబోతోంది. మామూలుగా అయితే ఈ పాటికే టిడిపి ప్రచారం ఉధృతంగా జరుగుతుండాల్సింది.

కానీ తెరవెనుక ఏమి జరుగుతోందో తెలీదు కానీ పార్టీలో కీలక నేతలు పెద్దగా నియోజకవర్గంపై దృష్టి పెట్టలేదన్నది మాత్రం వాస్తవం. చంద్రబాబు అయితే అసలు అడ్రస్సే కనబడలేదు. చినబాబు సంగతి సరేసరి. ఈయనగారు ప్రచారానికి ఎంతదూరంగా ఉంటే అంతమంచిదని కొందరు నేతలు అనుకుంటున్నారు.

కానీ చినబాబు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కదా మరి ఎన్నికల్లో కీలక బాధ్యతలు తీసుకోకపోతే ఎలాగని అనుకునే నేతలు కూడా ఉన్నారు లేండి. మొత్తం మీద అందరూ పాపం కిరణ్మయి అని అనుకుంటున్నారు.