నిజామాబాద్‌లో కవిత ఓడిపోతుంది… కోమటిరెడ్డి సవాల్

కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలంగాణ కాంగ్రెస్‌ లో క్లాస్, మాస్ ఇమేజ్ ఉన్న నేత. నిన్న,మొన్నటి వరకు నల్లగొండ జిల్లా రాజకీయాలకు మాత్రమే పరిచయం ఉన్న ఆయన ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా  హాట్ టాపిక్‌గా మారాడు. కాంగ్రెస్‌లో ఉన్న గ్రూపు రాజకీయాలతో తనకే పీసీసీ పగ్గాలు కావాలని గట్టిగా కొట్లాడుతూ, అధికార టీఆర్‌ఎస్ పై నిత్యం విమర్శలు చేస్తూ పార్టీలో కాస్త ఇమేజ్‌ను పెంచుకోగలిగారు. అయితే ఆయన ఎప్పుడు మాట్లాడినా ఏదో ఒక సంచలన వ్యాఖ్య మాత్రం తప్పకుండా చేస్తున్నారు. దీంతో ఆయన హాట్ హాట్ గా నిలుస్తున్నారు. గజ్వేల్ నుంచి సీఎం కేసీఆర్ పై పోటీ చేసి గెలుస్తానని, దమ్ముంటే సీఎం రంగంలోకి దిగాలని సవాల్ విసరడం ఆయనకే చెందింది. అయితే ఆయన నిజామాబాద్‌లో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ఇంతకీ ఆయన ఏమన్నారంటే…

నిజామాబాద్ ఎంపీగా కవితను మళ్లీ గెలిపిస్తే తాను రాజకీయ సన్యాసం చేస్తానని మంత్రి కేటీఆర్‌కు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సవాల్ విసిరారు. ఈ సవాల్ ఇప్పుడు అందరిలో చర్చనీయాంశమైంది. ఎందుకంటే కాంగ్రెస్‌లోకి డీఎస్ రానున్నారనే బలంతోనే కోమటిరెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారా అనే అనుమానాలు బలపడుతున్నాయి. నిజామాబాద్ లో డీఎస్‌కు, కవితకు మధ్య విబేధాలతో నిజామాబాద్ రాజకీయం వేడెక్కిన సంగతి తెలిసిందే. దీంతో డీఎస్ వస్తున్నారనే సంకేతంతోనే కోమటిరెడ్డి కేటీఆర్‌కు సవాల్ విసిరారనే చర్చ జరుగుతుంది. కాంగ్రెస్ లో ఒక కోరిక బలంగా ఉంది. అదేమిటంటే, నిజామాబాద్ ఎంపీ స్థానాన్ని ఎలాగైనా లాక్కోవడం. రెండు, సిఎం కెసిఆర్ కుటుంబ సభ్యులను ఓడించడం. ఇప్పుడు ఈ కసీ కోమటిరెడ్డి మాటల్లో నుంచి వ్యక్తమయింది. దీనికి తోడు  పీసీసీ కోసం పోరాడుతున్న కోమటిరెడ్డి నిజామాబాద్ జిల్లా పర్యటన కూడా ఆసక్తికరంగా మారింది. నిజామాబాద్‌లో ప్రత్యక్షమయ్యి కేటీఆర్‌కి సవాల్ విసరడంతో ఆయన రాష్ట్ర రాజకీయాలపై పూర్తి స్థాయి దృష్టి పెట్టి కాంగ్రెస్‌లో తిరుగులేని నేతగా ఎదగాలనుకుంటున్నాడనే విషయం అర్ధమవుతుంది. కానీ అది సాధ్యమయ్యే పనేనా అనే అనుమానాలు లేకపోలేదు. ఆనాడు కేసీఆర్ పైనా,  ఈనాడు కేటీఆర్ పైనా చేసిన వ్యాఖ్యలు మాత్రం ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం సమయంలో జరిగిన ఘర్షణలో కాంగ్రెస్ నేతలు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సంపత్ కుమార్‌ల శాసనసభ్యత్వాన్ని స్పీకర్ రద్దు చేశారు. తాను నిత్యం ఏదో ఒక కారణంతో ప్రభుత్వంపై విమర్శల దాడి చేయడంతో తనకు కళ్లెం వేయాలని భావించే సర్కారు ఈ పని చేయించింది అని ఆయన చెప్పుకొచ్చారు. కానీ ఆయన అప్పటి నుంచే ఇంకా దూకుడు పెంచారు. మొత్తానికి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వ్యాఖ్యలపై మళ్లీ ప్రాధాన్యత సంతరించుకుంది. మరీ దీనిపై అధికార టీఆర్ ఎస్ , కేటీఆర్ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి….