చివరకు తెలుగుదేశంపార్టీ మీడియా కూడా రివర్స్ టెండరింగ్ ఫలితాలను స్వాగతిస్తున్నట్లే కనబడుతోంది. తాజాగా పోలవరం ప్రాజెక్టులోని హెడ్ వర్క్స్, హైడల్ ప్రాజెక్టుకు పిలిచిన రివర్స్ టెండరింగ్ లో భారీగా ప్రజాధనం ఆదా అవ్వటాన్ని చంద్రబాబు మీడియా కూడా మొదటి పేజీలో ప్రచురించింది.
మూడు రోజుల క్రితం ఇదే ప్రాజెక్టులోని 65వ ప్యాకేజికి పిలిచిన రివర్స్ టెండరింగ్ ప్రక్రియలో కూడా సుమారు రూ. 58 కోట్లు మిగిలిన విషయం అందరికీ తెలిసిందే. అయితే అప్పుడు ఆ వార్తకు రెండు ప్రధాన పత్రికలు ఏమాత్రం ప్రాధాన్యత ఇవ్వలేదు. లోపలి పేజీల్లో ప్రచురించటమే కాకుండా పాత కంపెనీకే పనులు వచ్చాయని కథనాలు అచ్చేసుకుని తృప్తి పడ్డాయి.
కానీ తాజాగా మాత్రం ప్రముఖంగానే మొదటిపేజిలో ప్రచురించాల్సిన పరిస్ధితి వచ్చింది. ఎందుకంటే రెండో రివర్స్ టెండరింగ్ విధానంలో ప్రభుత్వానికి సుమారు రూ. 682 కోట్లు మిగిలింది. ఇంత భారీ ఎత్తున ప్రజాధనం ఆదా అవటం మామూలు విషయం కాదు. అందుకనే వేరే దారిలేకే మొదటి పేజిలో ప్రముఖంగా ప్రచురించాల్సొచ్చింది.
ఎలాగూ రివర్స్ టెండర్ ప్రక్రియలోని మంచిని తమ మీడియా ఆమోదించి స్వాగతించింది కాబట్టి ఇక ఆమోదించాల్సింది చంద్రబాబునాయుడు అండ్ కో మాత్రమే. ప్రజాధనం ఆదా అవటాన్ని చంద్రబాబు అండ్ కో ఆమోదించలేకపోతున్నారు. అందుకనే ప్రాజెక్టుల నాణ్యత గురించి పనికిమాలిన లాజిక్కులతో రాజకీయం చేయటానికి ప్లాన్లు వేస్తోంది.
ఫొటో : ఈనాడు సౌజన్యంతో