టిఆర్ఎస్‌పై కోమటిరెడ్డి సోదరుల సవాళ్లు నిలబడేనా ?

కోమటిరెడ్డి బ్రదర్స్ రోజురోజుకు తమ స్వరం పెంచుతున్నారు. ఓ వైపు అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, మరో వైపు తమ్ముడు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి టీఆర్‌ఎస్ పై విమర్శనాస్త్రాలు కురిపిస్తున్నారు. కేసీఆర్ కుటుంబమే లక్ష్యంగా విమర్శలు  చేస్తూ ప్రజల్లో తమకు ఒక ఇమేజ్ ఏర్పరుచుకున్నారు. దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి రాజకీయ శిష్యునిగా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నల్లగొండ కాంగ్రెస్ రాజకీయాలలోకి అడుగుపెట్టారు. కమ్యూనిష్టుల కంచుకోట అయిన నల్లగొండలో 1999 నుంచి ఇప్పటి వరకు వరుసగా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి నల్లగొండలో తిరుగులేని రాజకీయ నాయకునిగా కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి నిలిచారు. తన సోదరుడు రాజగోపాల్‌రెడ్డిని రాజకీయాల్లోకి ఆహ్వానించి కాంగ్రెస్ భువనగిరి ఎంపీగా 2009 ఎన్నికల్లో గెలిపించుకున్నారు. వెంకట్ రెడ్డి.. తన శిష్యుడైన చిరుమర్తి లింగయ్యను కూడా 2009 ఎన్నికల్లో నకిరేకల్ ఎమ్మెల్యేగా గెలిపించుకున్నారు. రాజశేఖర్ రెడ్డి హయాంలో వెంకట్ రెడ్డి మంత్రి పదవి పొందారు. కోమటిరెడ్డి బ్రదర్స్, చిరుమర్తి లింగయ్యల స్వగ్రామం బ్రాహ్మణ వెల్లంల. అలా ఒకే ఊరిలో ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీ, ఒక మంత్రి ఉండటం నిజంగా ఆ గ్రామానికి గొప్పే కదా. అలా పేరు సంపాదించుకున్న కోమటిరెడ్డి బ్రదర్స్ 2014 ఎన్నికల్లో టీఆర్‌ఎస్ దెబ్బకు వెంకట్‌రెడ్డి మాత్రమే గెలువగలిగారు కానీ భువనగిరి ఎంపీగా రాజగోపాల్ , నకిరేకల్ ఎమ్మెల్యేగా చిరుమర్తి లింగయ్య లు ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో రాజగోపాల్‌రెడ్డి టీఆర్‌ఎస్ పై గెలిచి రికార్డు సృష్టించాడు. తాము కోల్పోయిన నకిరేకల్ ఎమ్మెల్యే స్థానాన్ని నిలబెట్టుకోవడానికి కోమటిరెడ్డి బ్రదర్స్ తీవ్రంగానే శ్రమిస్తున్నారు. ఇటీవల నకిరేకల్‌లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్పిన జోస్యం అందరిలో చర్చకు దారితీసింది…ఇంతకీ  ఆ జోస్యం ఏంటంటే…

వచ్చే 2019 ఎన్నికల్లో నకిరేకల్ ఎమ్మెల్యేగా చిరుమర్తి లింగయ్య యాభై వేలు కాదు లక్ష ఓట్ల మెజార్టీతో గెలుస్తాడని కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి జోస్యం చెప్పారు. టీఆర్ ఎస్ ఎమ్మెల్యే వేముల వీరేశానికి డిపాజిట్ కూడా దక్కదని ఆయన వ్యాఖ్యానించారు. నల్లగొండ జిల్లా అంటేనే సీఎం కేసీఆర్‌కు భయం పట్టుకుంటుందని అందులో నకిరేకల్ అంటే ఇంకా భయం పట్టుకుంటుందన్నారు. పిళ్లాయిపల్లి, ధర్మారెడ్డి కాలువలకు సొంతంగా రూ.4 కోట్లు ఖర్చు పెట్టి కాలువ పనులు పూర్తి చేసి రైతుల కళ్లలో ఆనందం చూశానని తెలిపారు. రాజగోపాల్ రెడ్డి చెప్పిన జోస్యం… నిజమే అవుతుందేమో అని చాలా మంది అనుకుంటున్నారు. ఎందుకంటే ప్రస్తుత టీఆర్ ఎస్ ఎమ్మెల్యే వేముల వీరేశం తన ఆగడాలతో ప్రజలలో వ్యతిరేక ముద్ర వేసుకున్నారు. వీరేశం పరిపాలన విధానం కూడా నచ్చక ప్రజలు విసిగిపోయారు. వీరేశం చిల్లర రాజకీయాలతో దిగజారుడు నేతగా మారాడు. దీంతో టీఆర్ ఎస్ అధిష్టానం కూడా  డేంజర్ లిస్టులో వీరేశం పేరు చేర్చినట్టు సంకేతాలు అందుతున్నాయి. దీంతో కోమటిరెడ్డి బ్రదర్స్ తమ అనుచరుడు చిరుమర్తి లింగయ్యను గెలిపించేందుకు సమయం దొరికినప్పుడల్లా నకిరేకల్ నియోజకవర్గ పర్యటన చేస్తున్నారు. ప్రస్తుత ఎమ్మెల్యే వీరేశం లోపాలను ఆధారంగా చేసుకుని ప్రజలలోకి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. కమ్యూనిష్టుల కంచుకోటగా ఉన్న నకిరేకల్ నియోజకవర్గంలో ప్రస్తుతం వారు గట్టిపోటీ ఇచ్చే స్థాయిలో లేరు. దీంతో వీటన్నింటిని తమకు అనుకూలంగా మలుచుకొని తీవ్రంగా శ్రమిస్తే కోమటిరెడ్డి బ్రదర్స్ అండదండలతో చిరుమర్తి లింగయ్య లక్ష ఓట్ల మెజార్టీతో గెలవడం పెద్ద సమస్య కాదనే చర్చ ప్రస్తుతం నకిరేకల్ నియోజకవర్గంలో జోరుగా సాగుతుంది. తాము మాట్లాడేది తక్కువే అయినప్పటికీ మాట్లాడిన మాటలతోనే కోమటిరెడ్డి బ్రదర్స్  పెద్ద చర్చకు దారి తీసేలా చేస్తున్నారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సీఎం కేసీఆర్ పై సవాల్ విసిరి అలాగే కవిత 2019లో నిజామాబాద్ ఎంపీగా గెలిస్తే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటా అని హాట్ గా నిలిచారు. నకిరేకల్ జోస్యంతో తమ్ముడు రాజగోపాల్ రెడ్డి చర్చల్లోకెక్కారు. దీంతో అన్నదమ్ముల సవాల్‌లు , జోస్యాలు 2019లో ఎలా పని చేయనున్నాయో చూడాలి మరీ…