రాజకీయాల్లో ఒకరిపై ఒకరు విమర్శలు, ప్రతివిమర్శలు చేసుకోవడం మామూలే. అప్పుడప్పుడు అవి శృతిమించుతుంటాయి కూడ. ప్రస్తుతం ఏపీలో ఇదే పరిస్థితి కనబడుతోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను విమర్శిస్తున్న ప్రత్యర్థి పార్టీల్లో కొందరు నేతలు పదే పదే ఆయన్ను సీఎం పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తుండటం చిత్రంగా అనిపిస్తోంది. అసలు ముఖ్యమంత్రి లాంటి అత్యున్నత పదవిలో ఉన్న వ్యక్తిని ప్రత్యర్థులు చీటికీ మాటికీ ఇలా అనడం చూస్తే అంత ఈజీగా రాజీనామా ఎలా అడిగేస్తారనే డౌట్ రాక మానదు.
గతంలో టీడీపీ నేతలు పమువురు ఇదే వ్యాఖ్యలు చేయగా తాజాగా ఏపీ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసి రెడ్డిగారు కూడా అలానే మాట్లాడారు. అసలు పదవి నుండి దిగిపోవాల్సినంత తప్పు ఆయనేం చేశారో మరి. ఈమధ్య కాలంలో హైకోర్టులో ఏపీ సర్కార్ తీరుపై చురకలు పడిన సంగతి వాస్తవమే. ఇది ఏ ప్రభుత్వానికైనా తప్పదు. కాకపోతే వైఎస్ జగన్ సర్కారుకు కాస్త ఎక్కువ మొత్తంలో ఎదురుదెబ్బలు తగులుతున్నాయ్. వాటికి మూల్యం చెల్లించుకుంటున్నారు కూడ.
కానీ వాటిని పట్టుకుని సీఎం రాజీనామా చేయాలని అనడం ప్రజాతీర్పును వ్యతిరేకించడమే అవుతుంది. వైఎస్ జగన్కు సీఎం పదవిని కట్టబెట్టింది ప్రజలు. అది కూడా భారీ మెజారిటీతో. అలాంటప్పుడు ఆయన్ను పదవి నుండి దిగిపొమ్మని చెప్పాల్సింది కూడా ప్రజలే కానీ రాజకీయ పార్టీలు, నేతలు కాదు. ఒకవేళ నిజంగా జనం వైఎస్ జగన్ను పదవి నుండి దించాలి అనుకుంటే వచ్చే దఫా ఎన్నికల్లో ఆ పని చేస్తారు. అది ఓటర్ల అభిమతానికి సంబంధించిన విషయం. కాబట్టి మాటి మాటికీ సీఎం రాజీనామా చేయాలని రాజకీయ నేతలు డిమాండ్ చేయడం ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును అపహాస్యం చేసినట్టే అవుతుంది. కనుక ఇకనైనా ఈ విపరీత నినాదాలను మానుకుని సీఎం నిజంగానే తప్పులే చేస్తే దాన్ని జనాలకు, న్యాయస్థానాలకు తెలియజేసే పని చేయాలి. అప్పుడు తీర్పేదో వాళ్లే చెబుతారు.