రాష్ట్రంలో రోజు రోజుకు కోవిడ్-19 కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. కరోనా వైరస్ నుండి ఆంధ్రప్రదేశ్ ప్రజలను కాపాడేందుకు సంచలన ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నిర్ణయంతో రాష్ట్రంలో ఉన్న ప్రైవేటు ఆస్పత్రుల నిర్వహణ, వైద్య సేవలు, రోగ నిర్ధారణ పరీక్షలు, ఇన్ పేషెంట్ సేవలు మొత్తం అన్నీ ప్రభుత్వ ఆధీనంలోకి రాబోతున్నాయి.
ఎట్టి పరిస్థితుల్లోనూ కరోనా కట్టడే లక్ష్యంగా జగన్ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటోంది. ఇటీవలే ఉత్తరాఖండ్ ప్రభుత్వం కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ఏ విధంగా అయితే ప్రైవేటు ఆసుపత్రులను ఆదీనంలోకి తీసుకుందో.. అదే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా చేయనుంది. లాక్ డౌన్, కరోనా వైరస్ ప్రబలే అవకాశాలు ఉన్నందున ఇప్పటికే రాష్ట్రంలో ప్రైవేటు ఆసుపత్రులు మూసేస్తున్న నేపథ్యంలో.. ఆ సేవలను వినియోగించుకునేలా ఈ నిర్ణయం ఉపయోగపడనుంది.
జగన్ నిర్ణయంతో ఏపీలో వైద్య విభాగాలు మొత్తం ప్రభుత్వ పరిధిలోకి రానున్నాయి. అవసరమైతే ఆస్పత్రుల్లో పనిచేసే ప్రత్యేక విభాగాలకు చెందిన వైద్యులను కూడా వాడుకోవాలని ఈ మేరకు ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుని వైద్య, ఆరోగ్య శాఖ అధికారులకు ఆదేశాలు ఇచ్చింది. అలాగే అన్ని ప్రైవేట్ ఆస్పత్రుల అధికారులు జిల్లా కలెక్టర్ లేదా, నియమితులైన ప్రత్యేక అధికారి ఆదేశాలను తప్పక పాటించాలని ఈ ఉత్తర్వుల్లో ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ సేవలను ఎప్పుడు వినియోగించుకోలన్న విషయాన్ని కూడా ఆయా జిల్లా కలెక్టర్లు నిర్ణయించేలా ఆదేశాలు జారీ చేసింది.