అమరావతిలో రైతుల ఆందోళనలు ఇప్పట్లో ఆగేట్టులేదు. 64 రోజులు గడుస్తున్నా రైతులు ప్రధానంగా మహిళలు ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. రోజుకొక రీతిలో ఆందోళనలు సాగిస్తున్నారు. పోలీసులు దురుసుగా ప్రవర్తించారని రాజధాని గ్రామాల్లో శనివారం సంపూర్ణంగా బంద్ జరిగింది. అన్ని వర్గాల ప్రజలు బంద్ లో పాల్గొన్నారు.
మార్క్సిస్టు పార్టీ ఈ ఉద్యమంలో కొన్ని మినహా ఇంపులతో ఇంతకాలం వున్నా రాష్ట్ర కార్యదర్శి మధు వచ్చి అమరావతి రాజధానిగా వుండాలసిదేనని తేల్చి చెప్పారు. అంటే రాష్ట్రంలో అన్ని పార్టీలు ఈ అంశంలో ఒకటి అయ్యాయి. వైసిపి ఒంటరిదైనది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్థిర చిత్తం గల నేత కావడం మొన్నటి ఎన్నికల్లో ప్రజలు అఖండ విజయం చేకూర్చినందున ఒంటరి వాడుగా పోరాటం చేస్తున్నారు. అదే మరొకరైవుంటే పరిస్థితి మరోలా వుండేది.
ఇప్పుడు అసలు విషయానికొద్దాం. అమరావతిలోని అమరేశ్వరుని రథోత్సవం ఆదివారం జరిగింది. అమరేశ్వరుని మొక్కలు చెల్లించుకొనేందుకు రాజధాని రైతులు ఎక్కువ మంది వచ్చారు. ఈ సందర్భంగా రైతులు రోడ్డు పక్కన వుండగా వైసిపి యంపి నందిగం సురేష్ కారు రైతులను రాసుకుంటే వెళ్లడంతో హనుమంతరావు అనే రైతు గాయ పడ్డాడు.
ఇదిలా వుండగా యంపి నందిగం సురేష్ దైవ దర్శనం చేసుకొని వస్తుండగా మహిళలు అడ్డగించి జై అమరావతి అనాలని డిమాండ్ చేశారు. అందుకు తిరస్కరించి వెళుతుండగా మహిళలు అడ్డగించారు. ఈ సందర్భంగా వైసిపి కార్యకర్తలు ఎదుర్కొన్నారు. తోపులాట జరిగింది. మహిళల పట్ల దురుసుగా ప్రవర్తించారని ఆరోపించుతున్నారు. ఈ లోపు పోలీసులు వచ్చి సర్దుబాటు చేసి పైగ 20 మంది మహిళలను అరెస్టు చేశారు. దీనితో మరింత మంది రాజధాని రైతుల సంఘటన స్థలానికి చేరుకున్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
సమస్య ఎక్కడో మొదలౌతుంది. తుదకు తోపులాటలు ఘర్షణల వరకు రావడం పోలీసులు రంగ ప్రవేశం చేసి సహజ సిద్ధంగా రాజధాని రైతులను మహిళలు అరెస్టు చేయడం జరుగుతోంది. గమనార్హమైన అంశమేమంటే రాజధాని రైతు కుటుంబాలకు చెందిన మహిళలు పోలీసులు పోలీసు స్టేషన్ లు అరెస్టులు ఏమాత్రం లెక్క చేసే పరిస్థితి కన్పించడం లేదు. సాధారణంగా సంఘటిత కార్మిక కుటుంబాల్లోని మహిళల్లో ఈ తరహా తెగింపు చూస్తుంటాము. కాని రైతు కుటుంబాల నుండి వచ్చిన మహిళలు ఇలాంటి పోరాటం చేస్తున్నారంటే కొంత ఆశ్చర్యం కలగక తప్పదు.