రవికుల రఘురామ రివ్యూ.. ప్రేక్షకులను మెప్పించిన ప్రేమకథ!

తెరపై ఎన్ని ప్రేమ కథలు వచ్చినా.. ఆడియెన్స్ ఆదరిస్తూనే ఉంటారు. అసలు ప్రేమ కథలు లేని చిత్రాలంటూ ఉండవు. అలాంటిది పూర్తి ప్రేమ కథా చిత్రంగా రవికుల రఘురామా అనే మూవీ వచ్చింది. గౌతమ్ వర్మ, దీప్షికలు జంటగా.. చంద్రకాంత్ తీసిన ఈ సినిమా మార్చి 15న విడుదలైంది. శ్రీధర్ వర్మ నిర్మించిన ఈ చిత్రం ఆడియెన్స్‌ను ఏ మేరకు ఆకట్టుకుందో ఓ సారి చూద్దాం.

 

కథ

గౌతమ్ (గౌతమ్ వర్మ) అనే వాడు కలియుగ రాముడి టైపు. ఇలాంటి అబ్బాయి.. నిషా (దీప్సికా ఉమాపతి) అనే అమ్మాయిని చూడటం.. ఆమె ప్రేమలో పడిపోతాడు. అంత మంచివాడ్ని ఆ అమ్మాయి కూడా తిరిగి ప్రేమిస్తుంది. ఆ తర్వాత. ప్రేమ అన్నాక బ్రేకప్ కూడా ఉంటుంది కదా?.. అదే కోవలో కొన్ని తప్పని పరిస్థితుల్లో ఇద్దరి మధ్య ఎడబాటు ఏర్పడుతుంది. గౌతమ్‌ను విడిచి నిషా వెళ్లిపోతుంది. అసలు నిషా ఎందుకు గౌతమ్‌ను ఎందుకు వదిలేయాల్సి వచ్చింది?. నిషా వదిలేసిన తర్వాత గౌతమ్ పరిస్థితి ఏమైంది?.. చివరికి నిషా, గౌతమ్ ఎలాంటి పరిస్థితుల్లో కలుసుకున్నారు? అన్నదే కథ.

 

నటీనటులు

కొత్తవారైనా కూడా హీరో హీరోయిన్లు తెరపై ఏ బెరుకూ లేకుండా నటించారు. గౌతమ్ పాత్రలో గౌతమ్ వర్మ చక్కగా నటించాడు. కలియుగ రాముడు అన్న పాత్రలో ఎంతో అమాయకంగా, మంచి వాడిగా కనిపించాడు గౌతమ్. ఇక ఎమోనల్ సీన్లలోనూ మెప్పించాడు. ప్రేమ కథా చిత్రాలకు గౌతమ్ యాప్ట్ అనిపించేలా నటించాడు. ఇక దీప్షిక తన అందం, నటనతో ప్రేక్షకులని కట్టి పడేస్తుంది. మిగిలిన పాత్రల్లో సత్య, జబర్దస్త్ నాటి వంటి వారు తమ తమ పరిధి మేరకు నవ్వించారు.

 

విశ్లేషణ

కొత్త డైరెక్టర్ అయినప్పటికీ.. చంద్రకాంత్ మంచి పాయింట్ తీసుకున్నారు. ప్రేమకథకు మదర్ సెంటిమెంట్ పెట్టి ఎమోషనల్ టచ్ ఇచ్చాడు. కథను తెరకెక్కించిన విధానం కూడా.. చాలా మెచ్యూర్డ్‌గా ఉంది. హీరో యాంగింల్‌లోనే కథ సాగినప్పటికీ.. హీరోయిన్ పాత్రకు మంచి ప్రాధాన్యం దక్కింది. ఇంటర్వెల్‌లో వచ్చే ట్విస్ట్ సినిమాపై ఆసక్తిని పెంచుతుంది. ఆ ఎపిసోడ్ ప్రేక్షకుల గుండెల్ని బరువెక్కిస్తుంది. ఇక సెకండ్ ఆఫ్‌లో వచ్చే ట్విస్టులతో పాటు కొన్ని సీన్లు ఎమోషన్‌ను గట్టిగానే పండాయి.

 

స్టోరీ లైన్ తెలిసిందే కావటం.. కొన్ని దగర్ల నెరేషన్ స్లో అవ్వటం.. కొత్త ఫేసులు కావటం.. కాస్త ఇబ్బంది పెట్టినా కూడా.. మంచి సంగీతం, పాటలు, ఆర్ఆర్, ఎమోషన్ ఇలా అన్నీ ఉండటంతో అలా అలా హాయిగా వెళ్లినట్టుగా అనిపిస్తుంది. ఒక మగాడు ప్రేమిస్తే ఊపిరి ఆగే క్షణం వరకు ప్రేమిస్తూనే ఉంటాడని హీరోయిన్ చెప్పిన డైలాగ్‌, నా కొడుకు రఘురాముడి లాంటి వాడమ్మ, నా కొడుకు ఎవరితో యుద్ధం చేయాలో తెలియక తనలో తానే యుద్ధం చేసుకున్నాడంటూ తల్లి చెప్పే డైలాగులు బాగుంటాయి.

 

మొత్తానికి సుకుమార్ పమ్మి సంగీతం, మురళీ కెమెరా వర్క్ బాగుంది. కొత్త ముఖాలతో సినిమా తీసినా.. ఫ్రెష్ లొకేషన్లు, ఫ్రేమింగ్, టేకింగ్‌లతో కథలోకి ప్రేక్షకులను లాక్కెళ్లిపోయారు. ప్రతి ఫ్రేమ్ ఫ్రెష్‌గా ఉండేలా జాగ్రత్త పడినట్టు తెరపైన కనిపిస్తోంది. మొదటి ప్రాజెక్ట్ అయినా కూడా దర్శక నిర్మాతలు మంచి క్వాలిటీ అవుట్ పుట్‌ను బయటకు తీసుకొచ్చారు. నిర్మాణ విలువలు బాగున్నాయి.

 

రేటింగ్: 3/5