బిగ్ బాస్ షో అంటే అన్ని రకాల ఎమోషన్స్‌తో కూడుకున్నది. ఓ మనిషికి ఉండే విభిన్న భావాలను బయటకు తీసుకొచ్చేలా చేస్తాడు బిగ్ బాస్. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా తొణకకుండా ఉంటాడా? లేదా పరిస్థితులను బట్టి మారుతాడా? నిశ్చల మనస్కుడా? నిజాయితీ కలవాడా? కోపం వస్తుందా? వస్తే ఆ సమయంలో హద్దులు దాటి ప్రవర్తిస్తాడా? ఇలా ఎన్నో రకాలుగా బిగ్ బాస్ పరీక్షిస్తాడు. వాటిని తప్పించుకుని తన నిజ స్వరూపాన్ని ప్రేక్షకుల ముందు పెట్టడం ఒకెత్తుఅయితే ఆ వ్యక్తిత్వం మెజార్టీ ప్రజలకు నచ్చి గెలిపిస్తారు.
బిగ్ బాస్ షోలో ఉన్న ఆంతర్యం అయితే ఇదే. కానీ కొందరు మాత్రం టాస్కులు చేయలేదు.. డ్యాన్సులు చేయలేదు.. అంటూ కంటెస్టెంట్లపై పెదవి విరుస్తుంటారు. అభిజిత్ విషయంలోనూ అలానే జరిగింది. మెజార్టీ ప్రజలు అభిజిత్ వ్యక్తిత్వాన్ని, అతని పరిపక్వతను చూసి గెలిపించారు. కొందరు మాత్రం అతను ఏం ఆట ఆడాడు.. ఖాళీగా సోఫాలో కూర్చోని ముచ్చట్లు పెట్టడం తప్పా అని గేలిచేశారు. కానీ చిరు చివర్లో ఓ ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు.
బిగ్ బాస్ షో ఆషా మాషీ కాదని, ఓ మనిషి ఎలా ఉండాలో ఉండకూడదో చెప్పేది.. ఇదొక రకమైన వ్యక్తిత్వ వికాసపు కోర్స్ వంటిదని చిరు చెప్పుకొచ్చాడు. అవును నిజమే చిరు చెప్పిందాంట్లో వంద శాతం నిజముంది. ఓ వ్యక్తి తనకు నచ్చని మనుషులు చుట్టు ఉన్నా, పదే పదే వేలెత్తి చూపుతున్నా. కట్టలు తెంచుకునే ఆగ్రహం వస్తున్నా కూడా నిబ్బరంగా శాంతంగా ఉంటే ఎలాంటి ఫలితాలు వస్తాయి.. ఆవేశం ఆపుకోలేక అరిచేస్తే ఎలాంటి పరిణామాలు ఏర్పడుతాయనే విషయాలను బిగ్ బాస్ నేర్పిస్తుంది.