తీవ్ర నిరాశ‌లో నిఖిల్.. మ‌ళ్లీ ముహూర్తం ఎప్పుడో?

దేశంలో ప‌రిస్థితుల‌న్ని స‌క్ర‌మంగా ఉంటే ఏప్రిల్ 16న‌ యంగ్ హీరో నిఖిల్ ఓ ఇంటివాడు అయ్యేవాడు. ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుని బ్యాచిల‌ర్ జీవితానికి గుడ్ బై చెప్పేయాల‌ని చూసాడు. కానీ ఇలాంటి టైమ్ లో ఎవ‌రు మాత్రం ఏం చేయ‌గ‌ల‌రు. క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా దేశంలో లాక్ డౌన్ విధించ‌డం…దాన్ని ఎప్ప‌టిక‌ప్పుడు పొడిగించుకుంటూ వెళ్లిపోవ‌డంతో నిఖిల్ తో పాటు చాలా మంది యువ‌తీయువ‌కులు ఇలానే ఇబ్బంది ప‌డుతున్నారు. మే 3తో లాక్ డౌన్ ముగిసిపోతే.. ఎంచ‌క్కా అదే నెల 14న పెళ్లి చేసుకోవాల‌ని నిఖిల్ రెండ‌వ ముహూర్తం కూడా పెట్టుకున్నాడు.

కానీ తాజాగా మే 3 నుంచి 17 వ‌ర‌కూ లాక్ డౌన్ పొడిగించ‌డంతో నిఖిల్ వివాహం మ‌ళ్లీ వాయిదా ప‌డింది. దీంతో ఈసారి మాత్రం నిఖిల్ తీవ్ర నిరాశ‌కు గురైన‌ట్లు తెలిపాడు. అయితే త‌న పెళ్లి వ‌ల్ల ఎవ‌రూ ఇబ్బంది ప‌డినా సంతోషంగా ఉండ‌లేన‌ని…అందుకే కొన్ని స‌డ‌లింపులు ఇచ్చినా కానీ పెళ్లిని కానిచ్చేయ‌డం లేద‌న్నాడు. అలాగే వివాహం అనేది ప్ర‌తి ఒక్క‌రి జీవితంలో ఓ మ‌ధుర ఘ‌ట్టం. కాబ‌ట్టి మంచిగానే ఉండాలి. ఇలాంటి క్లిష్ట ప‌రిస్థితుల్లో పెళ్లి చేసుకోవ‌డం క‌రెక్ట్ కాదు. అందుకే వైర‌స్ నియంత్ర‌ణ‌లోకి వ‌చ్చే వ‌ర‌కూ పెళ్లి గురించి ఆలోచించ‌న‌‌ని తెలిపాడు. అంటే నిఖిల్ పెళ్లి ఇప్పుడే అవుతుందో లేదో గ్యారంటీ లేద‌న్న మాట‌.

వైర‌స్ ప్ర‌భావం ఇంకెన్నాళ్లు ఉంటుందో చెప్ప‌లేని ప‌రిస్థితి. ప్ర‌స్తుతం కేసులు సంఖ్య పెరుగుతోంది త‌ప్ప త‌గ్గుముఖం ప‌ట్ట‌లేదు. అయితే దేశ ప‌రిస్థితుల‌ను దృష్టిలో పెట్టుకుని లాక్ డౌన్ అనేది ఎక్కువ కాలం కొన‌సాగించ‌లేరు. ద‌శ‌ల వారిగా లాక్ డౌన్ ఎత్తేసే అవ‌కాశం ఉంది. కాబ‌ట్టి పెళ్లిళ్లు చేసుకోవాలి అనుకున్నా! సింపుల్ గానే కానిచ్చేయాల్సి ఉంటుంది. వంద‌లాంది మంది గుమికూడ‌టం మంచిది కాదు కాబ‌ట్టి కొన్నాళ్లు సామాజిక దూరం పాటించ‌క త‌ప్ప‌దు. అలాంట‌ప్పుడు ఎంత మ‌ధుర‌ఘ‌ట్ట‌మైనా తెలంగాణ రాష్ట్ర‌ ముఖ్య‌మంత్రి కేసీఆర్ చెప్పిన‌ట్లు అటు 15 మంది..ఇటు 15 మందితోనే పెళ్లి తంతు కానిచ్చేయ‌డ‌మే ఉత్త‌మం.