బాల‌య్య బ‌ర్త్ డే కి మెగాస్టార్ ని ఆహ్వానిస్తారా?

న‌ట‌సింహ‌, హిందుపురం ఎమ్మెల్యే నంద‌మూరి బాల‌కృష్ణ భూములు పంచుకుంటున్నారంటూ తెలంగాణ సీఎం కేసీఆర్-టాలీవుడ్ పెద్దల భేటీపై చేసిన వ్యాఖ్య‌లు ఐదారు రోజులుగా సోష‌ల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిన సంగ‌తి తెలిసిందే. బాల‌య్య వ్యాఖ్య‌లు కార‌ణంగా నంద‌మూరి-మెగా అభిమానుల మ‌ధ్య సోష‌ల్ మీడియాలో మాట‌ల యుద్ధం న‌డుస్తోంది. అభిమాన సంఘాల మ‌ధ్య మ‌రోసారి చిచ్చుకు కార‌ణ‌మైంది. ఇక బాల‌య్య వ్యాఖ్య‌ల‌పై మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు కౌంట‌ర్ వేయ‌డంతో సీన్ మ‌రింత వేడెక్కిన సంగ‌తి తెలిసిందే. బాల‌య్య‌ని ఇండ‌స్ర్టీలో ఒంట‌రి వాడిని చేయ‌డ‌మే టార్గెట్ గా కొంద‌రు గ్రూప్ రాజకీయాలు న‌డుపుతున్నారు అన్న వార్త అంతే వేడెక్కిస్తోంది.

ఈ హీట్ లో బాల‌య్య జ‌న్మ‌దినోత్స‌వం వ‌స్తోంది. జూన్ 10న బాల‌య్య పుట్టిన రోజు. ఇప్పుడీ వేదిక సాక్షిగా బాల‌య్య ఇండ‌స్ర్టీలో త‌న బ‌లం చూపించుకునే ఓ ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని ఇన్ సైడ్ టాక్ జోరుగా వినిపిస్తోంది. అంగ‌రంగ వైభ‌వంగా టాలీవుడ్ పెద్ద‌లంద‌ర్నీ పుట్టిన రోజు వేడుక‌ల‌కు ఆహ్వానించి ఈ బ‌ర్త్ డేని ఘ‌నంగా జ‌రుపుకోవాల‌ని ప్లాన్ చేస్తున్నారుట‌. ప్ర‌తీ ఏడాది సింపుల్ గా జ‌రిగిపోతుంది. అభిమానుల సమ‌క్షంలో త‌న ఇంటి వ‌ద్దే కేక్ క‌ట్ చేసి కానిచ్చేస్తారు. అనంత‌రం సాయంత్రం కుటుంబ స‌భ్యుల వ‌ర‌కూ బ‌ర్త్ డే పార్టీ ఉండేది. అయితే ఈసారి టాలీవుడ్ ప్ర‌ముఖుల్ని ఆహ్వానించి ఓ ప్ర‌యివేటు హోట‌ల‌ల్ లో ప్ర‌భుత్వ నిబంధ‌న‌లు పాటిస్తూ గ్రాండ్ గా వేడుక‌ల‌కు సిద్దం అవుతున్న‌ట్లు తెలిసింది.

ఇండ‌స్ర్టీలో బాల‌య్య‌కు అనుకూలంగా ఉన్న హీరోల్ని, సామాజిక వ‌ర్గాన్ని త‌ప్ప‌కుండా ఆహ్వానించాల‌ని చూస్తున్నారుట‌. అలాగే ప‌రిశ్ర‌మ‌లో బిగ్ స్టార్స్ అంద‌ర్నీ కూడా ఆహ్వానించ‌నున్నారుట‌. అయితే ఈ వేడుకు మెగాస్టార్ చిరంజీవిని..ఆ ఫ్యామిలీ హీరోల‌ని ఆహ్వానిస్తారా? అన్న‌దే ఇక్క‌డ ట్విస్ట్ . ఎందుకంటే సీఎం కేసీఆర్ తో జ‌రిగిన భేటీలో లీడ్ తీసుకుంది చిరంజీవినే. ఆయ‌న ఆధ్వ‌ర్యంలోనే ప‌రిశ్ర‌మ పెద్ద‌లు కేసీఆర్ స‌హా మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్ తో భేటి అవ్వ‌డం జ‌రిగింది. ఆ భేటీకి బాల‌య్య‌ను చిరు ఆహ్వానించ‌లేద‌ని ఆరోప‌ణ‌లున్నాయి. మ‌రి ఇలాంటి ప‌రిస్థితుల న‌డుమ బాల‌య్య బ‌ర్త్ డే పిలుపు మెగా ఫ్యామిలీకి ఉంటుందా? ఉండ‌దా? అన్న‌ది చూడాలి.