యాంగ్రీ హీరో రాజశేఖర్ ప్రతిభ గురించి చెప్పాల్సిన పనే లేదు. టాలీవుడ్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ లో నటించిన గొప్ప స్టార్ ఆయన. చిరంజీవి – బాలకృష్ణ- సుమన్ – రాజశేఖర్ అంటూ 80లలో చెప్పుకునేవారంటేనే ఆయన స్థాయిని అర్థం చేసుకోవచ్చు. అయితే అంత పెద్ద స్టార్ ఉన్నట్టుండి కెరీర్ పరంగా డౌన్ ఫాల్ అవ్వడం.. అప్పట్లోనే ఆయన క్రమశిక్షణా రాహిత్యంపై మీడియాలో కథనాలు రావడం వగైరా వగైరా తెలిసిందే. ముఖ్యంగా ఆయన తాగుడు, సిగరెట్లకు బానిసైపోయి సెట్స్ కి సమయానికి రావడం లేదన్న ఆరోపణలు కూడా వినిపించాయి.
అయితే ఆ పుకార్లలో నిజం ఎంతో తెలీదు కానీ.. అసలు తన తాగుడు కారణమేంటో ఆయనే చెప్పారు ఓ టీవీ ఇంటర్వ్యూలో. వాస్తవానికి అతడికి ఎలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేనే లేవు. జీవిత తన జీవితంలోకి అడుగు పెట్టకముందే ఒకమ్మాయిని ఎంతో సిన్సియర్ గా ప్రేమించారట. అయితే తాను కాదనడంతోనే మందు-సిగరెట్ మొదలు పెట్టానని రాజశేఖర్ ఆ ఇంటర్వ్యూలో తెలిపారు. దేవుడంటే నమ్మకం లేకపోయినా తాగి వెళ్లి మరీ తన ప్రేమను సక్సెస్ చేయాలని దేవుడిని ప్రాధేయ పడినట్టు తెలిపారు. ఇక ఆ తర్వాత ఆ అమ్మాయితో పెళ్లి కాకపోయినా.. కాలక్రమంలో హ్యాబిట్స్ అలా కంటిన్యూ అయిపోయాయి.
జీవితతో కలిసి వరుసగా సినిమాల్లో నటించడం ఆ స్నేహం కాస్తా ప్రేమగా మారి పెళ్లాడడం తెలిసిందే. ప్రస్తుతం టాలీవుడ్ ఆదర్శ జంటల్లో వీరి పేరు వినిపిస్తుంది. ఈ జంటకు శివానీ-శివాత్మిక అనే గారాల డాటర్స్ ఉన్నారు. ఆ ఇద్దరూ కథానాయికలు అయ్యారు. గరుడవేగ చిత్రంతో బ్లాక్ బస్టర్ కొట్టిన రాజశేఖర్ తదుపరి కెరీర్ ని ఎంతో క్రేజీగా ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. రాజశేఖర్ ఎంబీబీఎస్ చదివి సర్జన్ గానూ ప్రమోటయ్యారు. తర్వాత రకరకాల వైద్య విద్యల్ని అభ్యసించారు. ఇప్పటికీ పరిశ్రమలో సన్నిహితులకు ఉచితంగా వైద్యం అందిస్తుంటారు.
