మంచు విష్ణుకి ‘మా’లో దొరికే మద్దతు ఎంత.?

Who will support Manchu Vishnu In MAA.

Who will support Manchu Vishnu In MAA.

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికలపై ఇప్పుడిప్పుడే కాస్త స్పష్టత పెరుగుతోంది. బరిలోకి దిగుతున్నవారి సంఖ్య పెరుగుతోంది. చివరికి వచ్చేసరికి బరిలో ఎంతమంది నిలుస్తారు.? అన్నది ఇప్పుడే చెప్పలేం. కానీ, నిర్ణీత సమయానికంటే ముందే ‘మా’ (మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్)లో సినిమాటిక్ పొలిటికల్ హీట్ అయితే బాగా పెరిగిపోయింది. రాజశేఖర్, విష్ణు, జీవిత, హేమ తదితరుల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.

వీళ్ళలో ఫలానా వ్యక్తికి ఫలానా ఓట్లు పక్కగా వున్నాయంటూ సినీ పరిశ్రమలో చర్చ జరుగుతోంది. మెగా కాంపౌండ్ తరఫున మొత్తంగా 350 నుంచి 450 ఓట్లు ప్రకాష్ రాజ్ వైపుకే వెళతాయన్నది ఓ వాదన. అదే జరిగితే, ప్రకాష్ రాజ్ గెలుపు విషయంలో ఎలాంటి అనుమానాలూ అవసరం లేదు. కానీ, ప్రకాష్ రాజ్ విషయమై మెగాస్టార్ చిరంజీవి ఇంతవరకు ఎలాంటి ప్రకటనా చేయలేదు.. చేస్తారనీ ఆశించలేం. ఎందుకంటే, చిరంజీవి అందరివాడు.

మరోపక్క, మంచు విష్ణు కూడా.. చిరంజీవితో సన్నిహిత సంబంధాలున్న వ్యక్తి. మోహన్ బాబు – చిరంజీవి మంచి స్నేహితులు. ‘టామ్ అండ్ జెర్రీ’ తరహాలో గిల్లి కజ్జాలున్నా, మంచు విష్ణుని తన ఇంటి బిడ్డలానే చిరంజీవి చూస్తారు. మరోపక్క, మంచు విష్ణుకి నందమూరి బాలకృష్ణ, సూపర్ స్టార్ కృష్ణ, కృష్ణంరాజు తదితరుల మద్దతు వుందనే వాదన వినిపిస్తోంది.

జీవిత, హేమ కూడా చివరి నిమిషంలో విష్ణు వైపు వెళ్ళొచ్చంటున్నారు. ఏ క్షణాన అయినా సినీ రాజకీయాలు అనూహ్యమైన మలుపు తిరగొచ్చు. అసలు గొడవంతా ఎందుకు.? ‘మా’ అధ్యక్ష పదవిని ఏకగ్రీవం చేస్తే పోలా.? అన్న వాదన కూడా వినిపిస్తోంది. సో, ఏం జరుగుతుందో ఇప్పుడే ఊహించలేంగానీ.. నానా రకాల వివాదాలూ ‘మా’ ఎన్నికల చుట్టూ ముసురుకుంటూ, సినీ పరిశ్రమ పేరుని బదనాం చేస్తున్నాయి.