నాని.. శర్వా.. ఇద్దరిలో విలన్ ఎవరు?

మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో నేచురల్ స్టార్ నాని రెండుసార్లు హీరోగా నటించాడు. అతడు హీరోగా పరిచయమైన ‘అష్టా చమ్మా’కి దర్శకుడు ఇంద్రగంటియే. ఇద్దరి కాంబినేషన్‌లో రెండో సినిమా ‘జెంటిల్‌మ‌న్‌’. ఇందులో నాని డ్యూయల్ రోల్ చేశాడు. రెండిటిలో నెగిటివ్ షేడ్స్‌తో కనిపించే పాజిటివ్ క్యారెక్టర్ ఒకటి. మళ్ళీ ఇంకోసారి ఇంద్రగంటి కోసం నెగిటివ్ షేడ్స్ వున్న క్యారెక్ట‌ర్‌లో నాని నటిస్తున్నాడా? లేదా? అని వెయిట్ చేస్తే తెలుస్తుంది. ‘సమ్మోహనం’తో సూపర్ సక్సెస్ అందుకున్న మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత దిల్‌రాజు ఒక మల్టీస్టారర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అందులో నానితో పాటు మరో హీరో శర్వానంద్ నటించనున్నారని టాక్.

 

‘జెంటిల్‌మ‌న్‌’ తరహాలో మల్టీస్టారర్ కోసం ఇంద్రగంటి ఒక లైన్ రెడీ చేశార్ట‌. కథలో విలన్ ఎవరనేది ఇంటర్వెల్ తరవాత గానీ తెలియదట. ఫస్టాఫ్ అంతా ఎవరు విలన్ అనే టైపులో ఆడియన్స్‌ ఆలోచించేలా సస్పెన్స్ క్రియేట్ చేస్తూ ముందుకు సాగుతుందని సమాచారం. ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. సెట్స్ మీదకు వెళ్లే సమయానికి ఎన్ని మార్పులు జరుగుతాయో!