హిట్ వస్తే అందరూ ఫుల్ హ్యాపీగా పండుగ చేసుకుంటారు. పార్టీలతో పులకించిపోతారు. అదే ప్లాఫ్ వస్తే…ఆ రిజల్ట్ కు ఎవరు భాధ్యత తీసుకుంటారా అని ఎదురుచూస్తారు. గొడవలు పడతారు..వివాదాలతో మీడియాకు ఎక్కుతారు. రామ్ చరణ్ నటించగా సంక్రాంతికి విడుదలైన ‘వినయ విధేయ రామ’ సినిమా పరిస్దితి అదే. ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని రాబట్టలేకపోయింది. ఆ విషయాన్ని ఖరారు చేస్తూ రామ్ చరణ్ అభిమానులకు ఓ లేఖ కూడా రాశాడు.
అది ప్రక్కన పెడితే .. ఈ సినిమాతో బయ్యర్లు టోటల్ గా ముప్పై కోట్ల వరకు నష్టపోయినట్లు లెక్క తేలింది. దీంతో రామ్ చరణ్ తను తీసుకున్న రెమ్యునరేషన్ నుంచి ఐదు కోట్లు వెనక్కి తిరిగి ఇస్తానని, మీరు కూడా అలా చేస్తే బాగుంటుందని బయ్యర్లకు రికవరిగా కొంతలో కొంత డబ్బుని తిరిగి ఇవ్వొచ్చని దర్శకనిర్మాతల వద్ద ఓ ప్రపోజల్ పెట్టారట. అయితే దానికి నిర్మాత దానయ్య అంగీకరించినా.. బోయపాటి మాత్రం స్పందించలేదని ఫిల్మ్ సర్కిల్స్ నుంచి వినిపిస్తోంది.
దాంతో వేరే దారి లేక ప్రముఖ నిర్మాత..ఈ సినిమాతో నష్టపోయిన దిల్ రాజుని మధ్యవర్తిగా పెట్టి రీసెంట్ గా ఓ మీటింగ్ పెట్టారట. ఈ మీటింగ్ లో ఫైనల్ గా బోయపాటి శ్రీను..తాను ఐదు కోట్లు తిరిగివ్వలేనని, ఒకటో రెండు కోట్లో సర్దగలుగుతానని అన్నాడట. దీంతో నిర్మాత దానయ్య పట్టరాని కోపం వచ్చిందిట. 15 కోట్లు రెమ్యునరేషన్ తీసుకొని, భారీ ఎత్తున అవసరం ఉన్నా లేకపోయినా వంద కోట్లు సినిమాపై ఖర్చు పెట్టించి.. ఓ డిజాస్టర్ సినిమా ఇచ్చి ఇప్పుడు డబ్బు వెనక్కి తిరిగివ్వనంటే ఎలా అంటూ బోయపాటిని ప్రశ్నించాడట.
దానికి బోయపాటి కూడా సీరియస్ అయ్యాడట. సినిమా ఫ్లాఫ్ అయితే వెనక్కి ఇస్తానని మనం ఎగ్రిమెంట్ చేసుకోలేదుగా అని అడ్డంగా మాట్లాడారట. దాంతో చివరకు ఒకరినొకరు బూతులు తిట్టుకునే వరకూ వ్యవహారం వెళ్లిందని చెప్పుకుంటున్నారు. దిల్ రాజు వాళ్లని శాంతపరిచినట్లు సమాచారం. చివరకు ఈ వివాదం ఎప్పుడు పరిష్కారమవుతుందో , ఎటు మలుపు తిరుగుతుందో చూడాలి!