రౌడీ దేవరకొండను ఆ నలుగురు హర్ట్ చేశారా? తనను భ్రష్టు పట్టించేందుకు కొన్ని మీడియాలు అదే పనిగా ఉద్ధేశపూర్వకంగా ఆర్టికల్స్ రాసాయా? అంటే అవుననే తన ఆవేదనను బట్టి అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. కరోనా క్రైసిస్ వేళ తాను ఆపాత్రదానం చేయలేదని నిలదీసే ప్రయత్నం చేసిన ఓ నాలుగు వెబ్ సైట్లు తనకు గుర్తున్నాయని దేవరకొండ ఫైరింగ్ అయ్యారు. ప్రక్షాళన చేయాల్సిన సమయం వచ్చింది! అంటూ చాలా సీరియస్ అయ్యారు. అంతేకాదు.. నన్ను ప్రశ్నించేందుకు మీరెవరు? అంటూ ఫైరింగ్ అవ్వడం ఫిలిం మీడియాలో ప్రముఖంగా చర్చకు వచ్చింది.
ఇక దేవరకొండ ఫౌండేషన్ పేరుతో తాను విరాళాలు సేకరిస్తే దానిపైనా మీడియాలు బురద జల్లాయని అది తనని కలచి వేసిందని వాపోయారు. అంతేకాదు.. విరాళాలు ఇచ్చేవాళ్లకు సమాధానం ఇవ్వాల్సి వచ్చిందని.. తనని తప్పుగా అనుకుంటారనే ఇప్పుడు మీడియా ముందుకు వస్తున్నానని ఓ వీడియోని దేవరకొండ రిలీజ్ చేయడం సంచలనమైంది. ఇందులో తనపై తప్పుడు ప్రచారం చేసిన మీడియాల్ని దేవరకొండ తనదైన శైలిలో తూర్పారబట్టారు.
అయితే ఎవరు ఏం రాసినా.. అదంతా ప్రజా ప్రయోజనార్థమే కదా? కరోనా క్రైసిస్ వేళ హీరోలంతా సాయం చేస్తుంటే దేవరకొండ సైలెంట్ గా ఉండడంపై సదరు మీడియాలు ప్రశ్నించాయి. అనంతర కాలంలోనే దేవరకొండ ఫౌండేషన్ వెబ్ సైట్ ని ప్రారంభించి పలువురికి నిత్యావసరాల కోసం ఆర్థిక సాయం చేశారు. దీనికి విరివిగా అప్లికేషన్లు రావడంతో లిమిటేషన్ దాటిపోయిందని ప్రస్తుతం అప్లికేషన్లు స్వీకరించడం లేదు. అయితే వీలున్నంతవరకూ అందరికీ నిత్యావసరాల సాయం చేస్తామని దేవరకొండ తాజా వీడియోలో వెల్లడించారు. అన్నట్టు దేవరకొండను అదే పనిగా టార్గెట్ చేసిన ఆ నాలుగు మీడియాలేవో ఆయన చెప్పనే లేదు. మీడియాలు తనని అలెర్ట్ చేశాయా? లేక నిందించాయా? అన్నదానిపైనా సరైన క్లారిటీ రాలేదింకా. ఫేక్ ప్రచారం అని విమర్శించారు కాబట్టి దానిని నిరూపించాల్సి ఉంటుందని తెలుగు సినీమీడియాలో చర్చ సాగుతోంది.
