చినబాబుని మెచ్చుకున్న వెంకయ్యనాయుడు

ఈమధ్యకాలంలో పూర్తిస్థాయి ఫ్యామిలీ మూవీస్ అరుదుగా వస్తున్నాయి. కార్తీ హీరోగా ఈ నెల 12 న రిలీజ్ అయిన చినబాబు సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంటుంది. రైతు నేపథ్యంలో, కుటుంబంలోని ఆప్యాయతలు, అనురాగాలు కలబోసిన సినిమాగా తెరకెక్కిన ఈ సినిమా పలువురి ప్రముఖుల ప్రశంసలు కూడా అందుకుంటోంది. తాజాగా ఈ సినిమా చూసిన ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ట్విట్టర్ ద్వారా స్పందించారు. చినబాబు టీముని ప్రశంసించారు.

వ్యవసాయ ప్రాధాన్యత, కుటుంబ జీవనం, పశుసంపద పట్ల ప్రేమ, ఆడపిల్ల పట్ల నెలకొన్న వివక్ష నేపథ్యంలో ‘చినబాబు’ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో ప్రజాదరణ పొందే విధంగా రూపొందించిన దర్శకుడు పాండిరాజ్, నిర్మాత సూర్య, నటుడు కార్తీకి అభినందనలు. ఈమధ్య కాలంలో నేను చూసిన మంచి మూవీ ‘చినబాబు’. అశ్లీలత, జుగుప్స మచ్చుకైనా లేకుండా రూపొందిన సినిమా. గ్రామీణ వాతావరణం, పద్ధతులు, సంప్రదాయాలు, పచ్చని పొలాలతో ఆహ్లాదభరితంగా రూపొందిన ‘చినబాబు’ సినిమా సకుటుంబ సమేతంగా చూడదగ్గ సినిమా అంటూ ట్వీట్ చేసారు.