‘వెంకీమామ’ లోగో ..సరిగ్గా చూస్తే అర్దమయ్యేది ఇదే

ఆ మధ్యన కొద్దిగా వెనక బడ్డ వెంకటేష్…‘ఎఫ్‌2’తో ఫుల్‌ ఫామ్‌లోకి వచ్చారు… తాజాగా ‘వెంకీమామ’ షూటింగ్‌తో బిజీ అయ్యారు. నాగ చైతన్య, వెంకటేష్‌ కలిసి నటిస్తుండటంతో.. ఈ మూవీపై అంచనాలు బాగానే ఏర్పడ్డాయి. చాలా కాలంపాటు వాయిదాపడుతూ వచ్చిన ఈ చిత్రం. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటోంది.

ఉగాది సందర్భంగా ఈ మూవీ టైటిల్‌ లోగోను కాసేపటిక్రితమే విడుదల చేసింది చిత్రయూనిట్‌. రాశి చక్రంలో ‘వెంకీ’ అనేది ఆంగ్ల అక్షరాలతో .. ‘మామ’ అనేది తెలుగు అక్షరాల్లో డిజైన్ చేశారు. పోస్టర్లో ఒక వైపున పల్లెటూరు .. మరో వైపున యుద్ధ వాతావరణం కనిపిస్తోంది.

ఇక ఈ టైటిల్ లోగో చూస్తే అర్దమయ్యే విషయం ఏమిటంటే..ఇది జ్యోతిష్యం, జాతకాల చుట్టూ తిరిగే కథ అని. అలాగే ఈ లోగో ప్రకారం కథ..యుద్దభూమి నుంచి పల్లెటూరు కు కథ నడుస్తుందని తెలుస్తోంది. 

తమన్ సంగీతం ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని అంటారు. ఆగస్టు నాటికి ఈ సినిమా షూటింగు పార్టును పూర్తి చేసి, దసరా పండుగకి విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు.

ఇందులో వెంకటేశ్, నాగచైతన్య నిజజీవితంలో మాదిరిగానే మామాఅల్లుళ్లుగా నటించనున్నారు. సురేశ్‌ ప్రొడక్షన్స్, కోన ఫిల్మ్‌ కార్పొరేషన్, పీపుల్స్‌ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో వెంకటేశ్‌ సరసన పాయల్‌ రాజ్‌పుత్, నాగచైతన్యకు జోడీగా రాశీఖన్నా నటిస్తున్నారు. ఈ చిత్రానికి కేఎస్‌ రవీంద్ర (బాబి) దర్శకత్వం వహిస్తున్నారు.