`వాల్మీకి`లో వ‌రుణ్ క్యారెక్ట‌ర్ గుట్టు లీక్

ఎవ‌రీ గ‌ద్ద‌లకొండ గ‌ణేష్!

ప్ర‌యోగాల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌గా మారాడు మెగా ప్రిన్స్ వ‌రుణ్‌తేజ్‌. కొత్త త‌ర‌హా క‌థ‌ల‌కు అత‌డు ఊత‌మిస్తున్న తీరుపై ప్ర‌శంస‌లు కురుస్తున్నాయి. కెరీర్ ప్రారంభం నుంచి కొత్త త‌ర‌హా క‌థ‌ల్ని ఎంచుకుంటూ విజ‌యాల్ని సొంతం చేసుకుంటున్నాడు. అంత‌రిక్షం లాంటి చిత్రాలు బెడిసికొట్టినా త‌న పంథాను మాత్రం మార్చుకోవ‌డం లేదు ఈ మెగా హీరో. వ‌రుణ్‌తేజ్ న‌టిస్తున్న తాజా చిత్రం వాల్మీకి. త‌మిళ హిట్ చిత్రం జిగ‌ర్తాండ‌కు రీమేక్‌గా ఈ చిత్రాన్ని హ‌రీష్‌శంక‌ర్ తెర‌కెక్కిస్తున్నారు. పూజా హెగ్డే క‌థానాయిక‌. అధ‌ర్వ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నాడు. 14 రీల్స్ ప్ల‌స్ బ్యాన‌ర్‌పై రామ్ ఆచంట‌, గోపీచంద్ ఆచంట సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

వ‌రుణ్‌తేజ్ కొత్త గెట‌ప్ అదిరిందిగా!

ఈ చిత్రంలో విభిన్న‌మైన పాత్ర‌లో వ‌రుణ్‌తేజ్ క‌నిపించ‌బోతున్నారు. ఒక విధంగా నెగెటివ్ క్యారెక్ట‌ర్‌. సినిమాలో క‌ర‌డుగ‌ట్టిన రౌడీగా వ‌రుణ్ పాత్ర కొత్త పంథాలో వుండ‌బోతోంది. పాత్ర పేరుని కూడా ద‌ర్శ‌కుడు కొత్త‌గా వుండేలా జాగ్ర‌త్త‌లు తీసుకున్నాడు. ఇందులో వ‌రుణ్ పాత్ర పేరు గ‌ద్ద‌ల‌కొండ గ‌ణేష్‌. సినిమాలో వ‌చ్చే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్‌లో వ‌రుణ్ బెల్ బాట‌మ్ ప్యాంట్‌తో 80ల నాటి రెట్రో లుక్‌లో క‌నిపించ‌బోతున్నాడు. దీనికి సంబంధించిన లుక్‌ని మేక‌ర్స్ విడుద‌ల చేశారు. ఈ ఫోటొ ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు చివ‌రి ద‌శ‌కు చేరుకున్న ఈ చిత్రాన్ని ఈ నెల 20న విడుద‌ల చేస్తున్నారు.