సంపూ చేసేది అదేగా..సప్తగిరీ మళ్లీ నువ్వెందుకు?

హాస్యనటుడిగా వెండితెరకు పరిచయమై హీరోగా అలరించే ప్రయత్నాలు చేస్తున్నారు సప్తగిరి. ప్రస్తుతం ఆయన ‘వజ్ర కవచధర గోవింద’ సినిమాలో నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి టీజర్ ను రిలీజ్ చేశారు. సప్తగిరి వాయిస్ పై .. అందుకు సంబంధించిన విజువల్స్ పై ఈ టీజర్ ను కట్ చేశారు. అయితే ఈ టీజర్ చూసిన వాళ్లంతా సప్తగిరి ఏంటి ..ఇలా సంపూర్ణేష్ బాబులా మారిపోయాడని కామెంట్స్ చేస్తున్నారు.

“నేనో వలస పక్షిని .. నాకంటూ ఒక గమ్యం లేదు .. నన్ను వెతుక్కుంటూ ఒక నలుగురు వచ్చారు .. స్నేహితులన్నారు. ఓ అందమైన అమ్మాయి వచ్చింది .. ప్రియురాలు అంది. నేనెప్పుడూ వినని .. వెళ్లని చోటు నుంచి గుంపులు గుంపులుగా వందలమంది వచ్చారు .. శత్రువులమన్నారు. ఇక మేక .. పులి ఆట మొదలైంది. నా ధైర్యం .. నా ఆయుధం .. నా సంకల్ప బలం” అంటూ ఈ వాయిస్ ఓవర్ కొనసాగింది. మీరూ టీజర్ పై ఓ లుక్కేయండి.

Vajra Kavachadhara Govinda Teaser || Saptagiri || Arun Pawar || Siva Sivam Films

దర్శకుడు అరుణ్ ప‌వార్ మాట్లాడుతూ.. ‘నా ద‌ర్శ‌క‌త్వంలో స‌ప్త‌గిరి హీరోగా న‌టించిన ‘స‌ప్త‌గిరి ఎక్స్‌ప్రెస్’ విడుద‌లై ఎంత పెద్ద విజ‌యం సాధించిందో అంద‌రికీ తెలిసిందే. ఇప్పుడు తీస్తున్న ‘వ‌జ్ర క‌వ‌చ‌ధ‌ర గోవింద’ అంత‌కు మించి విజయం సాధించాలనే త‌ప‌న‌తో కృషి చేస్తున్నాం. స‌ప్త‌గిరి నుంచి ప్రేక్ష‌కులు ఏం ఆశిస్తారో, ఆ అంశాల‌న్నీ మా సినిమాలో ఉంటాయి. సప్తగిరి శైలికి సరిపోయే కథ ఇది.

మా క‌థ‌కు అనుగుణంగానే ప‌వ‌ర్‌ఫుల్‌గా ‘వ‌జ్ర క‌వ‌చ‌ధ‌ర గోవింద’ అనే టైటిల్‌ పెట్టాం. మా నిర్మాత‌లు కొత్త‌వారే అయినా ఎక్కడా రాజీపడేలేదు. ఇందులో కడుపుబ్బా నవ్వించే అంశాలతోపాటు, మంచి యాక్షన్, ఎమోషన్, ఇతర వాణిజ్య అంశాలు మెండుగా ఉంటాయి’ అని అన్నారు.

అరుణ్ పవార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో .. వైభవీ జోషీ హీరోయిన్…. అర్చనా వేద, టెంపర్ వంశీ, అప్పారావు, అవినాష్, వీరేన్ తంబిదొరై తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. విజయ్ బుల్గానిన్ సంగీతం అందిస్తున్నారు. నరేంద్ర యెడల, జీవీఎన్‌ రెడ్డి నిర్మిస్తున్నారు. చిత్రీకరణ 80 శాతం పూర్తయిందని నిర్మాతలు పేర్కొన్నారు.