క్రేజీ మూవీ 34 కోట్లకు ఓటీటీ డీల్ ఫైనల్?
కరోనావైరస్ మహమ్మారి టాలీవుడ్ ఫేట్ మార్చేసిన సంగతి తెలిసిందే. దాదాపు డజను పైగా సినిమాలు ఈపాటికే రిలీజ్ కావాల్సి ఉండగా నాలుగైదు నెలలుగా డైలమాలో పడిపోయాయి. థియేటర్లు తెరవక ప్రతిదీ డిజిటల్ రిలీజ్ వైపు అడుగులు వేయాల్సిన సన్నివేశం కనిపిస్తోంది.
ఇన్నాళ్లు చోటా మోటా సినిమాలే ఓటీటీల్లోకి వచ్చాయి. కానీ తాజా సమాచారం ప్రకారం.. ఓ క్రేజీ మూవీ డిజిటల్ (ఓటీటీ) వీక్షకుల్ని మెస్మరైజ్ చేసేందుకు రెడీ అవుతోంది. నాని-సుధీర్ బాబు కథానాయకులుగా నటించిన మల్టీస్టారర్ చిత్రం `వి` ని డిజిటల్లో రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారు. ఇప్పటికే ఈ సినిమా డిజిటల్ రైట్స్ కి 34 కోట్ల డీల్ కుదిరిందని సమాచారం. ఇక వీ టీజర్ ట్రైలర్ ఆకట్టుకున్న సంగతి తెలిసిందే.
డిజిటల్ రిలీజ్ సరైనదా కాదా? అన్నదానిపై ఇన్నాళ్లు డైలమా కొనసాగింది. కానీ మహమ్మారీ శాంతింకపోవడంతో.. ప్రస్తుత పరిస్థితులను విశ్లేషించిన తర్వాత ఇక వేచి ఉండకూడదని దిల్ రాజు, నాని నిర్ణయించుకున్నారు. అమెజాన్ ప్రైమ్ డిజిటల్ హక్కులను రూ .34 కోట్లకు కొనుగోలు చేసింది. వి సెప్టెంబర్ 5 న విడుదలకు సిద్ధం చేస్తోంది. దీనిపై త్వరలో అధికారిక ప్రకటన చేయనున్నారట. థియేట్రికల్ రైట్స్ కి ఏమాత్రం తగ్గని రేంజ్ లోనే నానీ మల్టీస్టారర్ బిజినెస్ సాగిందన్న ముచ్చటా సాగుతోంది.
యాక్షన్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిన `వి` చిత్రంలో నాని, సుధీర్ బాబు, అదితి రావు హైడారి, నివేదా థామస్ ప్రధాన తారాగణం. ఈ సినిమా తర్వాత రామ్- రెడ్, రానా- ఆరణ్య, అనుష్క – నిశాబ్ధం, వైష్ణవ్ తేజ్- ఉప్పెన డిజిటల్ లో రిలీజ్ కానున్నాయని సమాచారం. ఇప్పటికే కోన వెంకట్ నిశ్శబ్ధం సినిమాని ఓటీటీ రిలీజ్ కి సిద్ధం చేస్తున్నారన్న సమాచారం ఉంది.