కెరీర్ లో రెండు, మూడు సార్లు ఇబ్బందిపడ్డాను – సమంత

కెరీర్ లో రెండు, మూడు సార్లు ఇబ్బందిపడ్డాను – సమంత

దర్శకుడు కథ చెబుతుండగానే పాత్రలోకి పరకాయ ప్రవేశం చేశాననే మాట నటుల నుంచి తరచూ వినిపిస్తుంటుంది. కొన్ని కథలు, పాత్రలు నటులకి ఆ స్థాయిలో కనెక్ట్ అవుతాయి. అయితే పాత్రల్లో ఒదిగి పోవడం ఎంత ముఖ్యమో, వాటి ప్రభావం నుంచి బయటికి రావడం అంతకంటే ముఖ్యమని చెబుతోంది సమంత. ”నటులు రోజూ ఒక కొత్త పాత్రతో ప్రయాణం చేయాల్సి ఉంటుంది. అలాంటప్పుడు ఒక పాత్రలోనే ఉండిపోతే సమస్యలొస్తాయి.

కొన్ని పాత్రలు వ్యక్తిగత జీవితంపై ప్రభావం చూపుతుంటాయి. ఆ విషయాన్ని కేరీర్ ఆరంభంలోనే పసిగట్టాను. అందుకే సెట్ నుంచి బయటికి వస్తుండగానే స్విచ్ఆఫ్ చేసినట్టుగా ఆ పాత్రని అక్కడే కట్టి పెట్టి ఇంటికి రావడం అలవాటు చేసుకొన్నా. నా కెరీర్ లో రెండు, మూడు సార్లు మాత్రమే అది సాధ్యం కాక ఇబ్బందిపడ్డాను . ఆయా సినిమాల తర్వాత కూడా కొన్నాళ్ల పాటు ఆ కథ, పాత్రలు నన్ను వెంటాడాయి” అని చెప్పుకొచ్చింది. అది సరే.. బాగా తగ్గినట్టున్నారు? అని సమంతని అడిగితే.. చిరునవ్వుతో సమాధానం చెప్పి తప్పించుకుంది. ఏది ఏమైనా చైతూతో పెళ్లి అయ్యాక సమంతలో ఊహించని మార్పులే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా బరువు తగ్గి నాజూగ్గా మారింది!