దిల్ రాజు చిట్ చాట్ @20 ఏళ్ల జర్నీ
పంపిణీదారుడిగా .. ఎగ్జిబిటర్ గా .. అగ్ర నిర్మాతగా దిల్ రాజు సుపరిచితం. `ఒకే ఒక్కడు`, `పెళ్లి పందిరి` చిత్రాలతో ఆయన పయనం మొదలైంది. నేటి(జూలై 24)తో 20 సంవత్సరాలు దిగ్విజయంగా పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా హైదరాబాద్ మీడియాతో దిల్ రాజు ముచ్చటిస్తూ పలు ఆసక్తికర సంగతులు తెలిపారు.
1999లో `ఒకే ఒక్కడు`తో మొదలై ఇంత జర్నీ చేశాం. జూలై 24న `తొలిప్రేమ` చిత్రాన్ని భాగస్వామ్యంలో రిలీజ్ చేశాం. పవన్‌కల్యాణ్‌గారిని స్టార్‌ను చేసిన ఆ సినిమా అనుభవం గొప్పగా అనిపించింది. అలాగే `పెళ్లిపందిరి` నిర్మాతగా నేను ఇక్కడ ఉండటానికి కారణమైందని దిల్ రాజు తెలిపారు. 16 ఏళ్లలో 32 సినిమాలు నిర్మించామని.. గత ఏడాది మూడు సినిమాలు నిర్మించగా.. ఈ ఏడాది నాలుగు సినిమాలు నిర్మిస్తున్నామని వెల్లడించారు.
20ఏళ్ల జర్నీలో తమ అనుభవం ఇకపై నవతరం నిర్మాతలకు ఉపయోగపడాలని భావిస్తున్నామని దిల్ రాజు ఈ సందర్భంగా తెలిపారు. బాలీవుడ్ లో కరణ్ జోహార్ తరహాలోనే తెలుగులో ఇతర నిర్మాతలతో కలిసి పని చేస్తామని .. కొత్త పంథా కాన్సెప్టుల్ని తెరకెక్కించే ఔత్సాహిక ఫిలింమేకర్స్ కి సాయపడతామని దిల్ రాజు ప్రామిస్ చేశారు. ఇతర నిర్మాతలతో కలిసి జాయింట్ వెంచర్లకు ప్లాన్ చేస్తున్నామని.. స్క్రిప్టు దశ నుంచే ప్రొడక్షన్ లో ఇన్వాల్వ్ అయ్యి మంచి ఔట్ పుట్ కి సాయపడతామని దిల్ రాజు తెలిపారు. మంచి సినిమాలు ఇవ్వాలనే ఈ ప్రయత్నం. మా సంస్థలోనే కాదు ఇతర సంస్థల్లోనూ మంచి సినిమాలు రావడానికి సాయం చేస్తామని అన్నారు. ఇకపై రాజుగారిని టాలీవుడ్ కరణ్ జోహార్ అని పిలవొచ్చేమో!