విశాఖ-గోపాలపట్నం రూరల్ లో నేటి ఉదయం చోటు చేసుకున్న విష వాయువు దుర్ఘటనతో దేశం మొత్తం మరోసారి ఏపీ వైపు చూసింది. అక్కడ చోటు చేసుకున్న సంఘటలను.. హృదయ విదారక దృశ్యాలను చూసి అంతా చలించిపోయారు. సోషల్ మీడియా వేదికగా రాజకీయ నాయకులు, ప్రజలు దిగ్భ్రాంతిని వ్యక్తం చేసారు. ఈ నేపథ్యంలో తాజాగా టాలీవుడ్ సెలబ్రిటీలు ఘటనపై స్పందించారు. మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. విశాఖలో విషవాయువు స్టెర్లిన్ బారినపడి ప్రజలు మరణించటం మనసుని కలచివేసింది. మరణించిన వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. అస్వస్థతకు గురైన వారందరు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానన్నారు… అని విచారం వ్యక్తం చేశారు.
“వైజాగ్ గ్యాస్ లీక్ వార్త విని చాలా బాధకు గురయ్యా. ప్రస్తుత విపత్కర సమయంలో మరింత కష్టం. మృతి చెందిన వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. అస్వస్థకు గురైన వారు త్వరగా కోలుకోవాల“ని మహేష్ బాబు అన్నారు. “2020 ఎందుకింత కష్టంగా ఉంది. నిద్ర లేచిన వెంటనే గ్యాస్ లీకేజీ వార్త విన్నాను. బాధితులు త్వరగా కోలుకోవాల“ని కోరుకుంటున్నట్లు మంచు మనోజ్ అన్నారు. ఇంకా దర్శకుడు అనీల్ రావిపూడి మాట్లాడుతూ..వైజాగ్ దుర్ఘటన దృశ్యాలు చూసి షాక్‌కు గురయ్యా. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. అస్వస్థకు గురైన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నానన్నారు. వైజాగ్ గ్యాస్ లీక్ దృశ్యాలు హృదయ విదారకంగా ఉన్నాయని మంచు లక్ష్మి దిగ్బ్రాంతి వ్యక్తం చేసింది. ఇంకా పలువురు దర్శకులు, నిర్మాతలు, టెక్నీషియన్లు ఘటనపై విచారం వ్యక్తం చేసారు. విశాఖ చరిత్రలో నిలిచిపోయే ఘటన ఇదని..ఇలాంటి సంఘటను ఇప్పటివరకూ అక్కడ ఎప్పుడూ చోటు చేసుకోలేదని, భోపాల్ దుర్ఘటన తర్వాత గుర్తుండిపోయే ఘటన ఇదని చలించిపోయారు. ఇంకా పలువురు బాలీవుడ్ నటులు విచారం వ్యక్తం చేసారు. ఈ సందర్భంగా విశాఖతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని మదన పడ్డారు.