చిరు ఆఫీస్‌లో పెద్ద‌ల స‌మావేశం.. చివ‌రికేం తేల్చారు?

మెగాస్టార్ చిరంజీవి ఆఫీసులో సినీపెద్ద‌లు కొలువు దీరారు. వీళ్లంతా తెలంగాణ సినిమాటోగ్ర‌పీ మంత్రి త‌ల‌సాని శ్రీ‌నివాస యాద‌వ్ ముందు తమ స‌మ‌స్య‌ల గోడు వినిపించారు. ఈ చ‌ర్య‌ల్లో చిరు ఎంతో సానుకూల వాతావ‌ర‌ణం క్రియేట్ చేయ‌గ‌లిగార‌ని తెలుస్తోంది.

పరిశ్రమను తిరిగి తెరవడానికి లైన్ క్లియ‌ర్ చేయ‌డ‌మే ధ్యేయంగా తెలుగు చిత్ర పరిశ్రమ పెద్దలు తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో కలిసి హైదరాబాద్‌లోని చిరంజీవి కార్యాలయంలో స‌మావేశ‌‌మ‌య్యారు. ఈ సమావేశానికి చిరంజీవి, నాగార్జున, అల్లు అరవింద్, దిల్ రాజు, సురేష్ బాబు, సి కళ్యాణ్, జెమిని కిరణ్, శ్యామ్ ప్రసాద్ రెడ్డి, రాజమౌళి, వినాయక్, త్రివిక్రమ్, కోరటాల శివ, ఎన్ శంకర్ ఈ సమావేశానికి హాజరయ్యారు.

షూటింగుల అనుమ‌తులు స‌హా థియేటర్లను ప్రారంభించే మార్గాలపైనా ఈ స‌మావేశంలో చర్చించారు. పోస్ట్ ప్రొడక్షన్ పనులు రేపటి నుండి అనుమతించార‌ని తెలుస్తోంది. పరిశ్రమ జ‌నం ఒక మాక్ షూటింగ్ వీడియోను ప్రభుత్వానికి సమర్పించిన తరువాత షూటింగుల‌కు అనుమతించే నిర్ణయం తీసుకుంటార‌ట‌. అయితే థియేటర్లను తిరిగి తెరవడానికి మరికొంత సమయం పడుతుందని మంత్రివ‌ర్యులు చెప్పారు. ఏపీ ప్రభుత్వంతో కూడా ఇలాంటి సమావేశం జరిగే వీలుంద‌ని తెలుస్తోంది.