పెద్ద స్టార్లు ఓటీటీకి దిగుతారా? నామోషీ ఫీల‌వుతారా?

క‌రోనా క‌ల్లోలం బోలెడ‌న్ని పాఠాలు నేర్పిస్తోంది. చిన్నా పెద్దా.. పేద -ధ‌నిక‌ అనే తార‌త‌మ్యం ఉండ‌ద‌ని ప్రూవ్ చేసింది. వైర‌స్ కి అంద‌రూ ఒక్క‌టే. ఇదొక్క‌టే కాదు.. ఇంకా చాలా నేర్పించింది. ప‌ద్ధ‌తిగా ఒద్దిక‌గా ఉండ‌డం.. జాగ్ర‌త్త‌గా ఉండ‌డం.. అప్పులు ఈఎంఐలు లేకుండా సేవింగ్స్ పైనే ఆలోచించ‌డం.. త‌క్కువ ఖ‌ర్చుతో జీవించ‌డం వ‌గైరా వ‌గైరా పాఠాలు నేర్పిస్తోంది.

వినోద (సినీ) ప‌రిశ్ర‌మ‌ల‌కు స‌రికొత్త పాఠాల్ని నేర్పిస్తోంది. చిన్న హీరో పెద్ద హీరో మ‌ధ్య తార‌త‌మ్యాన్ని కూడా త‌గ్గించేస్తోంది. అంతెందుకు ఈ ఏడాది సెట్స్ పై ఉన్న సినిమాలేవీ రిలీజ్ కాక‌పోతే పెద్ద స్టార్లు అంతా ఏమైపోవాలి? క‌చ్ఛితంగా ఆల్ట‌ర్నేట్ వెతుక్కోవాలి. బిగ్ స్క్రీన్ కి ఆల్ట‌ర్నేట్ ఏం ఉంది? అంటే ఒక‌టి టీవీ ప‌రిశ్ర‌మ‌. రెండోది ఓటీటీ ప‌రిశ్ర‌మ‌. ఆ రెండు చోట్లా ఉపాధిని వెతుక్కోవాల్సిన స‌న్నివేశం ఉంటుంది.

అయితే నామోషీ వ‌దులుకుని బుల్లితెర‌కు ఓటీటీకి పెద్ద స్టార్లు వ‌స్తారా? అంటే దానికి కాల‌మే స‌మాధానం చెప్పాల్సి ఉంటుంది. జ‌నం “థియేటర్లు వ‌ద్దు .. ఓటీటీలే ముద్దు“ అని భీష్మించుకుని కూచుంటే ఎంత పెద్ద స్టార్లు అయినా దిగి రావాల్సిందే. అప్పుడు బ‌డ్జెట్లు కుదించుకుపోతాయి. ప‌రిమిత బ‌డ్జెట్లో వెబ్ సిరీస్ లు.. అలాగే టీవీ సిరీస్ లు చేయాల్సి ఉంటుంది. అందుకు చిన్న హీరోలు క‌మిటైపోయినా పెద్ద హీరోలు మాత్రం చాలా బింకానికి పోవాల్సి ఉంటుంది. మా రేంజు కిందికి పడిపోయింది అని ఫీల‌వ్వాల్సి ఉంటుంది. అలా కాకుండా చాలా మంది తెలివైన స్టార్లు ఇప్ప‌టికే పెద్ద తెర బుల్లితెర అనే తార‌త‌మ్యాన్ని త‌గ్గించేస్తూ అవ‌కాశం వ‌చ్చిన ప్ర‌తిదీ చేసుకుంటూ వెళ్లిపోతున్నారు. చిరంజీవి.. క‌మ‌ల్ హాస‌న్ లాంటి పెద్ద స్టార్లు వెబ్ సిరీస్ ల వైపు ఆలోచిస్తున్నారంటే.. ఇక‌పై టాలీవుడ్ పెద్ద హీరోల్లోనూ మార్పు రావ‌డం ఖాయంగానే క‌నిపిస్తోంద‌న్న గుస‌గుసా వినిపిస్తోంది. ఈగోలు వ‌దుల‌కుని న‌టిస్తే పోయేదేముంద‌యా? జ‌నాల‌కు మ‌రీ ఎక్కువ చేరువైపోతారు.. అంతేక‌దా?