తెలుగు రాష్ర్టాల ప్రభుత్వాలు సినిమాలకు, సీరియళ్లకు షూటింగ్ లు చేసుకోమని అనుమతిచ్చినా! సినిమాలు మాంత్రం ఇంకా సెట్స్ కు వెళ్లలేదు. అడపా దడపా సీరియళ్లు మాత్రం ప్రభుత్వ గైడ్ లైన్స్ ప్రకారం షూటింగ్ లు జరుపుకుంటున్నాయి. ఇక లో బడ్జెట్ సినిమాలు మాత్రం తక్కువ క్రూ తో అక్కడక్కడా షూటింగ్ లు ప్రారంభమయ్యాయి. పెద్ద హీరోల సినిమాలేవి సెట్స్ కు వెళ్లలేదు. పరిస్థితి చూస్తుంటే కరోనా వైరస్ కి వ్యాక్సిన్ వచ్చే వరకూ స్టార్ హీరోలు, దర్శకులు, నిర్మాతలు ఎవరూ సెట్స్ కు వెళ్లి షూటింగ్ చేసే వాతావరణం అయితే కనిపించలేదు. దీంతో జూనియర్ ఆర్టిస్టులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు.
సీసీసీ పేరిట నిత్యావసర సరుకులు ఇచ్చినా అవి నిండుకున్నట్లే తెలుస్తోంది. అలాగని సీసీసీ ఎన్నాళ్లు ఇలా నిత్యావసర సరుకులు ఇవ్వగలదు. ఇప్పటివరకూ ఇచ్చిన నిత్యావసర సరుకులతో రెండు, మూడు నెలల పాటు ఇబ్బంది లేకుండా గడిచిపోయింది. కానీ ఇకపై ఆపరిస్థితి లేదు. దీంతో జూనియర్ ఆర్టిస్టుల్లో ఆకలి కేకలు మొదలయ్యాయి. చేయడానికి వేరే పని చేతగాక పస్తులు ఉండాల్సిన పరిస్థితి ఇప్పటికే కొంత మందిలో రాగా..రానున్న నెల రోజుల్లో అందరి పరిస్థితి అలాగే ఉంటుందని పలువురు జూనియర్ ఆర్టిస్టులు అంటున్నారు. కృష్ణానగర్, యూసఫ్ గూడ, వెంకటగిరి, ఇందిరా నగర్ లో ఉన్న జూనియర్ ఆర్టిస్టులను టచ్ చేస్తే ఈ విషయాలన్ని బయటకు వచ్చాయి.
చేతిలో డబ్బులు.. తినడానికి తిండి లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నామని మీడియా ముందు కన్నీటి పర్యంతం అయ్యారంటే పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో? అర్ధమవుతోంది. చిన్న చిన్న సినిమా షూటింగ్ లు జరుగుతున్నప్పటికీ తక్కువ మంది ఆర్టిస్టులను పిలుస్తున్నారని, దీంతో మిగతా వాళ్లకు పనిలేకుండా పోతుందని వాపోయారు. ఇండస్ర్టీలో జూనియర్ ఆర్టిస్ట్ బ్రతుకంటే? దినసరి కూలీ బ్రతుకులాంటిందేనని ఓ లేడీ ఆర్టిస్ట్ అన్నారు. కూలిపనికెళ్లి సాయంత్రం వరకూ కష్టపడితే! సాయంత్రం యజమాని కూలీ డబ్బులు ఎలా ఇస్తాడో? సినిమా షూటింగ్ కి సాయంత్రం ప్యాకప్ చెప్పిన తర్వాత అలాగే ఇస్తారని అన్నారు. ఆర్టిస్ట్ సంఘాల్లో ఉన్న కార్డు హోదాని బట్టి వేతనం ఉంటుందన్నారు. చాలా మంది పనులు లేక ఇబ్బందులు పడుతున్నారని ఇదే గనుక కొనసాగితే ఆత్మహత్యలే శరణ్యమంటున్నారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం అందలేదని..అసలు సినిమా వాళ్లను పట్టించుకోవడం లేదని వాపోయారు.