కింగ్ నాగార్జునపై సూపర్ స్టార్ కృష్ణ అభిమానులు దాడి చేసారా? సూపర్ స్టార్ ని నాగార్జున `వాడు..వీడు` అనడంతోనే ఈ దాడి జరిగిందా? ఈ దాడి వెనుక అసలు సూత్రధారి ఎవరు? ఆ కాంబినేషనే కొంప ముంచిందా? పూల్ ఔర్ కాంటేనే ఈ వివాదానికి కారణమా? అంటే అవుననే అంటున్నారు ఓ సీనియర్ పాత్రికేయుడు. 1991 లో `పూల్ ఔర్ కాంటే` అనే ఓ సినిమా రిలీజ్ అయి హిందీలో పెద్ద విజయం నమోదు చేసింది. ఇందులో అజయ్ దేవగణ్ హీరోగా నటించగా..ఓ ముఖ్యమైన పాత్రలో అమ్రిష్ పూరి నటించాడు. బాలీవుడ్ లో అనూహ్య విజయాన్ని అందుకున్న ఈ సినిమాని తెలుగులో రీమేక్ చేయాలని మురళీ మోహన్ హక్కులు తీసుకున్నారు.
హీరోగా అక్కినేని నాగార్జునను ఎంపిక చేసారు. ఇక అమ్రిష్ పూరి పాత్రలో ఎవర్ని ఎంపిక చేయాలా? అని తీవ్ర చర్చలు.. సమా వేశాలు అనంతరం సూపర్ స్టార్ కృష్ణ అయితే బాగుంటుందని ఆయన్ని ఎంపిక చేసారు. ఇక అప్పటికే మంచి సక్సెస్ ఫుల్ దర్శకుడిగా ఉన్న ఈ వీవీ సత్యనారాయణని డైరెక్టర్ గా ఎంపిక చేసుకున్నారు. ఇలా ఈ నలుగురి కాంబినేషన్ లో `పూల్ ఔర్ కాంటే` రీమేక్ `వారసుడు` టైటిల్ తో సెట్స్ పైకి వెళ్లింది. చిత్రీకరణలో భాగంగా ట్యాంక్ బండ్ కు సమీపంలోని ఓ పాత భవనంలో కృష్ణ-నాగార్జునలపై ఓ యాక్షన్ సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నారుట. అదే రోజు మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేయడం జరిగింది.
ఆ సమయంలో ఫోటో స్టిల్ కోసం నాగార్జున-కృష్ణ కాంబినేషన్ లో ఓ ఫోటో కావాలని ఫోటోగ్రాఫర్స్ అడిగారుట. ఆ బాధ్యత డైరెక్టర్ ఈవీవీపై పెట్టారు. ఆయన మాట ఇచ్చాడటంటే ఆ మాటపై కట్టుబడే మనిషి. ఈ నేపథ్యంలో కృష్ణను అడగగానే ఒకే చెప్పారుట. కానీ నాగార్జున మాత్రం ఆయనతో కలిసి ఫోటో దిగడం ఇష్టం లేకపోయినా డైరెక్టర్ మాట కొట్టేయలేక ఇచ్చాడుట. అప్పట్లో ఈ విషయాన్ని నాగార్జున బహిరంగంగానే చెప్పారుట. అప్పటి మీడియా సర్కిల్స్ లో పెద్ద హాట్ టాపిక్. ఆ తర్వాత `వారసుడు` అన్ని పనులు పూర్తిచేసుకుని 1993లో రిలీజ్ అయింది. ఆ రిలీజ్ కూడా పెద్ద వివాదమే నట.
హైదరాబాద్ సంధ్య థియేటర్ లో తొలి మార్నింగ్ షో పడగానే కృష్ణ అభిమానులు థియేటర్ ముందు పెద్ద ఎత్తున ఆందోళన చేసారుట. సినిమాలో డైలాగుల పరంగా కృష్ణని నాగార్జున వాడు..వీడు అనడం నచ్చక సూపర్ స్టార్ అభిమానులు థియేటర్లో కూర్చీలు విరిచేసి…సినిమా రీళ్లు పగలగొట్టడం చేసారు. ఆపై థియేటర్ బయట పెద్ద ఎత్తున ధర్నాకు దిగారుట. నాగార్జున పోస్టర్లపై పేడ చిమ్మడం..కొడిగుడ్లు…టమోటాలు విసరడం వంటి సంఘటనలు చోటు చేసుకున్నాయట. ఆ కారణంగా సినిమా ఆగిపోయిందని… ఆ తర్వాత సినిమాలో అభ్యంతరకర సన్నివేశాలు తీసేసి రిలీజ్ చేసారని సీనియర్ పాత్రికేయులు తెలిపారు.