నాని కొత్త సినిమా..ఇంట్రస్టింగ్ టైటిల్‌!

‘జెర్సీ’ చిత్రంతో సూపర్ హిట్ అందుకున్న నేచురల్‌ స్టార్‌ నాని.. తన తదుపరి ప్రాజెక్ట్‌ విషయాలను ఈ రోజు ( సోమవారం) ప్రకటించారు. మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో నాని సినిమా చేయబోతున్నారు. ఇందులో సుధీర్‌బాబు మరో హీరోగా నటించనున్నారు. ఈ సినిమా లోగోను నాని ట్విటర్‌ వేదికగా విడుదల చేశారు. ఎరుపు రంగులో ‘v’ అని రాసున్న ఈ సినిమా లోగో ఇంట్రస్టింగ్ గా ఉంది. క్రైమ్‌ థ్రిల్లర్‌ నేపథ్యంలో సినిమా నేపథ్యం ఉండబోతున్నట్లు సమాచారం.

నాని ట్వీట్ చేస్తూ..‘మోహనకృష్ణ నా మొదట చిత్రంతో నన్ను హీరోగా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం చేశారు. ఈరోజు నా 25 చిత్రంతో మళ్లీ పరిచయం చేయబోతున్నారు. కాకపోతే ఈసారి కాస్త విభిన్నంగా.. నా స్నేహితుడు(సుధీర్‌బాబును ఉద్దేశిస్తూ) కూడా పార్టీ (సినిమా)లో చేరబోతున్నాడు’ అని పేర్కొన్నారు.

సుధీర్‌బాబు కూడా సినిమా గురించి ట్విట్ చేస్తూ.. ‘సినిమాలో ఉన్న ఎన్నో ట్విస్ట్‌లలో ఇది మొదటి ట్విస్ట్‌. వెల్‌కమ్‌ నాని. మోహనకృష్ణ ఇంద్రగంటి తెరకెక్కించబోయే ఈ చిత్రం నుంచి ఊహించలేని విషయాలు మీ ముందుకు రాబోతున్నాయి’ అని పేర్కొన్నారు.

ఇక ఇంద్రగంటి, నానితో ఓ సరికొత్త ప్రయోగమేదో చేయబోతున్నాడని టైటిల్‌ని బట్టి తెలుస్తోంది. అయితే టైటిల్‌ ‘వి’ అనేది హీరోకి సంబంధించిన విక్టరీనా,? విలన్‌కి సంబంధించిన విలనిజమా.? అనేది తెలియాల్సి ఉంది.

అయితే ఈ సినిమా కాన్సెప్ట్‌ మొత్తం నాని క్యారెక్టర్‌ వైపు నుండే ఉండబోతోందనీ టాక్‌. టైటిల్‌ అనౌన్స్‌మెంట్‌తో పాటు సినిమాని కూడా ప్రారంభించేశారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై దిల్‌రాజు సినిమాను నిర్మిస్తోంది. అదితి రావు హైదరి, నివేదా థామస్ హీరోయిన్స్ గా నటించనున్నారు. అమిత్‌ త్రివేది సంగీతం అందించనున్నారు.