కూతురే  పెళ్లి కూతురైతే ..?

-భగీరథ

1981 జనవరి మాసం లో ఒక రోజు  సాయంత్రం ఆరు గంటల సమయం , అన్నపూర్ణ స్టూడియోస్ మొదటి ఫ్లోర్ ఎదురుగా వున్న కళ్యాణ మండపాన్ని నియాన్  లైట్లతో  ముస్తాబు చేస్తున్నారు . ఏమిటి విశేషం అని కనుక్కుంటే ” ప్రేమాభిషేకం” చిత్రంలోని ఓ పాటను చిత్రీకరిస్తున్నారు ” అని చెప్పారు. అక్కడున్న కో డైరెక్టర్ కమల్ తేజ్ . అంతలోనే దర్శకుడు దాసరి నారాయణ రావు అంబాసిడర్ కారులో నుంచి దిగారు. ఆయన
వెనుకనే రచయితలు, ఆయన నిర్మాతలు కూడా వచ్చారు.  నన్ను చూసి ” రా రా, ఇవ్వాళ మంచి పాట చిత్రీకరిస్తున్నాం ” అని నవ్వుతూ పలకరిచాడు . వెళ్లిపోదామనుకున్న నాకు దాసరి అలా అనగానే  ఆయన తో పాటు వెళ్లి కూర్చున్నా . సెట్లో సందడి మొదలయ్యింది . దాసరి నారాయణ రావు సినిమా అంటే మహా సందడి , సరదాగా ఉంటుంది . ఆయన చుట్టూ మనుషులు ఉండాలి . పైగా “ప్రేమాభిషేకం ” అన్నపూర్ణ స్టూడియోస్ వారిది కాబట్టి మర్యాదలకు లోటు ఉండదు .

ఆరోజు చిత్రీకరించబోయే పాటను నాగరా లో వినిపించమని చెప్పారు దాసరి . అలంకరణ పూర్తి అయ్యింది  నియాన్ లైట్లు దేదీప్యమానంగా వెలుగుతున్నాయి . నాగరా దగ్గర వున్న సౌండ్ ఇంజనీర్ పి . కృష్ణం రాజు ( రామ్ గోపాల్ వర్మ తండ్రి) పాటను ప్లే చేశాడు .  “తారలు దిగి వచ్చిన వేళ , మల్లెలు నడిచొచ్చిన  వేళ  — చందమామతో ఒక మాట చెప్పాలి , ఒక పాట పాడాలి … ” పాటను పూర్తిగా ప్లే చేశారు . సెట్లో  వున్న అందరు చప్పట్లు కొట్టారు .

“మీ గీతం , చక్రవర్తి గారి సంగీతం రెండూ  బాగున్నాయి ” అన్నాను దాసరికి షైక్  హ్యాండ్ ఇస్తూ .. ఆయన చాలా సంతోష పడ్డాడు . “ఆర్టిస్టులను పిలువు కమల్ ” అన్నాడు దాసరి . కో డైరెక్టర్ కమల్ తేజ్ మేకప్ గదులవైపు వెళ్ళాడు .

ఈ లోపల అన్నపూర్ణమ్మగారు  వచ్చారు . ఆమెతో పాటు  రెండు హాట్ క్యారియర్ లు  వచ్చాయి . దాసరి నారాయణ రావుకు  అన్నపూర్ణమ్మ ఇంటి నుంచి టిఫిన్ తీసుక వచ్చారు .  వేడి వేడి ఇడ్లీ , వడ , పెసరట్లు , మసాలా వేసిన పిరపకాయల బజ్జులు . అల్లం పచ్చడి , కొబ్బరి చట్నీ , కారం పొడి , నెయ్యి ,  ప్రొడక్షన్ బాయ్స్ వాటిని ప్లేట్లలో పెట్టి అందరికీ ఇచ్చారు. అందరు వాటిని ఆప్యాయంగా తినడం మొదలు పెట్టారు .


డైరెక్టర్ దాసరి నారాయణ రావుకు ఓ ప్రత్యేకత వుంది . టిఫిన్  లేదా భోజన సమయానికి ఎంత మంది ఉంటే అంత మంది తిన్నదాకా వదిలి పెట్టారు . మర్యాదల విషయంలో ఆయన్ని మించిన వారు  ఉండరంటే అతిశయోక్తి కాదు.

మేకప్ గది  నుంచి అక్కినేని, శ్రీదేవి , ప్రభాకర రెడ్డి, రాజా, కవిత  వచ్చారు .  అక్కినేని సూట్ లో దర్జాగా నడుసుకుంటూ వచ్చారు . ఆయన రాగానే దాసరితో సహా  అందరు నుంచున్నాము . “కూర్చోండి , కూర్చోండి ” అంటూ  మేము కూర్చున్న  చోటుకు  కాస్త  దూరాంగా వెళ్లి అన్నపూర్ణమ్మ దగ్గర కూర్చున్నారు .  శ్రీదేవి , చాలా అందంగా కనిపించింది . ప్రభాకర్ రెడ్డి , రాజా , కవిత మా ప్రక్కనే కూర్చున్నారు. పాటను  మరోసారి వినిపించమని చెప్పారు  దాసరి . పాట సాగుతూ వుంది . అప్పటికే జూనియర్ ఆర్టిస్టులను వారి వారి స్థానాల్లో నిలబెట్టారు . వారి మధ్యలో రెండు
కుర్చీలు వేశారు . రాజా , కవిత కొత్త దంపతులు, వారి రిసెప్షన్  జరుగుతుంది. అక్కినేని, శ్రీదేవి అతిధులుగా వస్తారు . అప్పటికే రాజేష్ పాత్రధారి
అక్కినేని, శ్రీదేవి పాత్ర దారి  శ్రీదేవిని గాఢంగా ప్రేమిస్తాడు . శ్రీదేవిని చూడగానే రాజేష్ పాడే పాట  ఇది , చెప్పారు దాసరి .


పాట అయిపొయింది . షాట్ తియ్యడానికి కెమెరా మన్ సెల్వరాజ్ ఏర్పాట్లు చేసుకుంటున్నాడు , వారి అసిస్టెంట్లు  లైట్స్ చూస్తున్నారు . అక్కినేని
సినిమాలకు ఎక్కువగా  సెల్వరాజ్ ఉంటాడు . అక్కినేనిని తెరపై  ఎలా మలచాలో  తెలిసిన కెమారా  మాంత్రికుడు  సెల్వరాజ్ .

అక్కినేనికి నేనంటే బాగా అభిమానం , అప్పటికే రెండు సార్లు నా వైపు చూశారు . నాకు అర్ధమైంది . “ఒక్కసారి నాగేశ్వర రావు గారి దగ్గరకు వెళ్లి వస్తా ” అన్నాను దాసరితో . ఆయన నా వైపు చూసి ఓ చిరు నవ్వు నవ్వారు . ఆయన ఆవులిస్తే పేగులు లెక్కపెట్టగల సమర్థులు . నేను కూడా నవ్వి అక్కినేని దగ్గరకు  వెళ్ళాను . నేను అక్కడికి వెళ్లడం చూసి ప్రొడక్షన్ బాయ్ ఓ కుర్చీ పక్కన వేశాడు . “ఏమిటి డైరెక్టర్ గారి కోసం వచ్చారా ?”
ఆ  ప్రశ్న ఎందుకు అడిగారా నాకు తెలుసు .

” శ్రీదేవి, మీమీద  చిత్రీకరిస్తున్న పాట  ఉందని కమల్ తేజ్ చెప్పాడు , పాట  విన్నా , చాలా బాగుంది , అందుకే వున్నా ” అని చెప్పాను. ఆయన నావైపు చూసి  నవ్వారు .  వేడి వేడిగా లెమన్  టీ  వచ్చింది .   లెమన్ టీ  అంటే ఆయనకు చాలా ఇష్టం . “మీరు  టిఫిన్  తినలేదు ” అన్నాను . “ఇందాకే రెండు ఇడ్లీలు  తిన్నా …అంతే … అంతకు మించి తినను . మసాలా మిరపకాయ బజ్జీలంటే చాలా ఇష్టం , ఒక్కటన్నా తినమని అన్నపూర్ణ బ్రతిమాలాడింది . పాటలు వున్నప్పుడు నేను చాలా లైట్ గా తీసుకుంటా  , పగలైతే ఎక్కువుగా నిమ్మకాయ మజ్జిగ
తాగుతా , రాత్రి కాబట్టి  లెమన్ టీ, ఆర్టిస్టులం , అందులో గ్లామర్ ప్రపంచం , జాగ్రతగా ఉండాలిగా  ” అన్నారు . “అవునవును ? అన్నాను . తిండి విషయంలో ఆయన రాజీ పడరు . అందులో ఎక్కువగా తింటే  నిద్ర వస్తుందని భయం .

“శ్రీదేవి చాలా ముద్దుగా , ముగ్ధగా వుంది ” అన్నాను . ఆ మాట విని అన్నపూర్ణమ్మ గారు నవ్వి అక్కినేని  వైపు చూశారు . అక్కినేని శ్రీదేవి వైపు చూసి , మళ్ళీ  అన్నపూర్ణమ్మ వైపు చూశారు . ” శ్రీదేవి ఎంత బాగున్నా , నేను మెచ్చిన జీవిత నాయిక అన్నపూర్ణే ” అన్నారు . ఆ మాటతో అన్నపూర్ణమ్మ  నవ్వి భర్త వైపు ఆరాధనగా చూశారు. ” శ్రీదేవి  భక్త తుకారాం సినిమాలో మీ కూతురుగా నటించింది . ఆసినిమా 1973 జులై 5న విడుదలైంది . బాల తారగా ఎంత క్యూట్ గా వుందో ?” అన్నాను . “అవును శ్రీదేవి చాలా అరుదైన నటి ,ఏక  సంధాగ్రహి “అన్నారు అక్కినేని . ఎనిమిది సంవత్సరాల తరువాత “ప్రేమాభిషేకం” చిత్రంలో నటిస్తుంది . చీరలో ఎంత అందంగా , కుందనపు బొమ్మలా వుంది ” అన్నాను .

 

“కరెస్ట్ గా చెప్పారు , ఈ సినిమాలో శ్రీదేవి పాత్ర ఆమె తప్ప ఇంకెవరు చెయ్యలేరు ” అన్నారు అన్నపూర్ణమ్మ . “అప్పుడు కూతురుగా నటించిన అమ్మాయితో … ” అంటూ అయన వైపు చూశాను . ఆ ప్రశ్నకు  సమాధానం ఏమిస్తారో అని ఆన్నపూర్ణమ్మ  ఆసక్తిగా  భర్త వైపు చూస్తుంది .
నేను ఎందుకు ఆ ప్రశ్న అడిగానో ఆయనకు  తెలుసు . అక్కినే సామాన్యుడు కాదు . ప్రపంచాన్ని చదివినవాడు. “అప్పటి శ్రీదేవి కూతురు…… ఇప్పటి శ్రీదేవి  పెళ్లి కూతురు ” అన్నారు నవ్వుతూ. ఆయన వైపు నవ్వుతూ చూసి ” కరెక్ట్ … మీరు చదువుకోని మేధావి … ” అన్నాను .
అన్నపూర్ణమ్మ అక్కినేని వైపు అలా చూస్తూండిపోయింది . అప్పుడే పాట మొదలయ్యింది . తారలు దిగి వచ్చిన వేళ ….. శ్రీదేవి లేచి
హుందాగా, వయ్యారంగా  నడుచుకుంటూ  వస్తోంది . నిజంగానే శ్రీదేవి  జాజ్వలమానంగా వెలిగే  “సితార ” లా అనిపించింది.

(భగీరధ బాగా పేరున్న సినిమా జర్నలిస్టు, హైదరాబాద్)