లాక్ డౌన్ నేపథ్యంలో షూటింగ్‌లేవీ అనుకున్న సమయంలో పూర్తికాలేదు. షూటింగులు సహా రిలీజ్ ల షెడ్యూల్స్ తలకిందులైపోయాయి. అయితే దీనివల్ల అందరి కంటే ఎక్కువగా నష్టపోయేది నిర్మాతలే. ఒక రోజు షూటింగ్ నిలిచిపోయిందంటేనే లక్షల్లో.. నష్టాన్ని భరించాల్సి ఉంటుంది. అగ్ర నిర్మాతలంతా బ్యాంకులు ఫైనాన్షియర్ల నుంచి కోట్లాది రూపాయాలు రుణాలుగా పొంది సినిమాలు చేస్తున్నారు. అయితే ఈ మూడు నెలలు పాటు ఆర్.బీ.ఐ ఈఎంఐ మారటోరియం విధించినప్పటికీ ఆ తర్వాత అయినా బకాయి ముక్కు పిండి మరీ వసూలు చేయనుందన్న సంగతి అర్థమైంది. లాక్ డౌన్ కాల వ్యవధిలో ప్రిన్సిపల్ పైనే వడ్డీలను చెల్లించక తప్పదు. పెంచిన వడ్డీలు యథావిధిగా కట్టాల్సిందే.
తాజా సన్నివేశంలో నిర్మాతలపై ఊహించని విధంగా ద్రవ్యం పరంగా భారం పడుతుంది. ఆ భారం తగ్గించాలంటే హీరోలు దిగి రావాలి. లేదంటే నిర్మాతలకు తడిపి మోపెడవుతుందన్న అంచనా వెలువడింది ఇప్టపికే. అందుకే నిర్మాతల గిల్డ్ స్టార్ హీరోలందరితో ఈ విషయంపై చర్చించాలని నిర్ణయం తీసుకున్నట్లు ఇన్ సైడ్ టాక్ వినిపిస్తోంది. హీరోలందరినీ ఒకే తాటిపైకి తీసుకొచ్చి అందర్నీ ఒకేసారి ఆహ్వానించి ఓ అత్యవసర భేటీ నిర్వహిస్తే బాగుంటుందని భావిస్తున్నారుట. పవన్ కళ్యాణ్.. మహేష్ బాబు..ఎన్టీఆర్..రామ్ చరణ్..ప్రభాస్..బన్నీ… ఇలా పెద్ద హీరోలంతా ఈ సమావేశానికి హజరయ్యేలా ప్రణాళిక రూపొందించారట. ప్రస్తుతం హీరోలంతా ఇంట్లో ఖాళీగానే ఉన్న నేపథ్యంలో ఇదే సమయంలో అయితే అందరూ దొరుకుతారని నిర్మాతలు భావిస్తున్నారుట.
అయితే వీరందరినీ ఏకం చేయడానికి గిల్డ్ ప్లాన్ ఒక్కటే సరిపోదని పరిశ్రమ పెద్దల సహాకారం కూడా తీసుకుంటే బాగుంటుందని ఆలోచన చేస్తున్నారుట. మరి ఆ రకంగా చూసుకుంటే ఆ బాధ్యతని మెగాస్టార్ చిరంజీవి తీసుకోవాల్సి ఉంటుందని అంటున్నారు. దర్శకరత్న దాసరి నారాయణరావు స్వర్గస్తులైన తర్వాత ఆ స్థానంలో చిరంజీకి కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయనే ముందుకు వచ్చే అవకాశాలున్నాయి. హీరోలందరినీ సమన్వయం చేసే అర్హత తనకు మాత్రమే ఉందని నిర్మాలంతా భావిస్తున్నారుట. సమావేశానికి హాజరైన హీరోలంతా నిర్మాతల కష్టాన్ని అర్థం చేసుకుని వారి కొత్త పాలసీని హీరోలు అంగీకరిస్తే వాళ్ల పాలిట రియల్ హీరోలుగా చరిత్రలో నిలిచే వీలుందని భావిస్తున్నారు. ఈ మీటింగ్ ఎప్పుడు జరుగుతుంది.. అసలేం జరగనుంది అన్నది వేచి చూడాలి.