సింగర్ బేబీకి మెగాస్టార్‌ చిరంజీవి ఆహ్వానం

గత కొద్ది రోజులగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ‘ఓ చెలియా నా ప్రియ సఖియా..’ పాట పాడిన గాన కోయిల బేబి దశ తిరిగిపోయింది. ఆమె తను పాడిన పాటతో లక్షలాది మంది అభిమానులను సంపాదించుకుంది. ఎక్కడ చూసినా ఆమె గొంతు వినిపిస్తోంది. సన్నగా సమ్మోహనంగా పాడిన పాటకు లెజెండరీ సింగర్ ఎస్పీ బాలసుబ్రమణ్యం సైతం ఫిదా అయ్యారు.

ఈ నేపధ్యంలో ప్రముఖ సంగీత దర్శకుడు కోటి పిలుపు మేరకు హైదరాబాద్‌ వెళ్లిన బేబీకి ఊహించని విధంగా మెగాస్టార్‌ చిరంజీవి నుంచి ఆహ్వానం లభించింది. కోటి సారథ్యంలోని బోల్‌ బేబి బోల్‌ కార్యక్రమంలో పాడే పాటలను ప్రాక్టీసు చేస్తున్న సమయంలో శుక్రవారం బేబీకి ప్రముఖ హీరో, మెగాస్టార్‌ చిరంజీవి స్వయంగా ఫోన్‌ చేసి మాట్లాడారు. శనివారం ఉదయం తమ ఇంటికి రావాలని ఆహ్వానించడంతో ఆమె ఆనందంతో ఉబ్బితబ్బిబయింది. ఈ సందర్భంగా ఆమె మీడియాతో ఫోన్‌లో మాట్లాడుతూ శనివారం ఉదయం చిరంజీవి ఇంటికి వెళ్లనున్నట్టు తెలిపారు.

ఎవరీ బేబి?

40 ఏళ్ల వయసు దాటిన ఈ గ్రామీణ గాయని ఓ సాధారణ కుటుంబానికి చెందిన మహిళ. ఆమె భర్త డ్రైవర్‌గా పని చేస్తున్నారు. శంకర్ దర్శకత్వంలో ప్రభుదేవా హీరోగా  వచ్చిన ‘ప్రేమికుడు’ సినిమాలోని ‘ఓ చెలియా.. నా ప్రియ సఖియా’ అంటూ సెమీక్లాసికల్‌ శైలిలో ఉండే పాటను అలవోకగా పైస్థాయి రాగాలను సైతం హాయిగా, శ్రవణానంద భరితంగా, మాధుర్యంగా పాడేయడం.. నెటిజన్లకు ఓ అద్భుతంలా అనిపించింది. ఏఆర్ రెహమాన్ సైతం ఈమె పాడిన పాటను ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు. ‘ఈమె ఎవరో తెలీదు.. కానీ ఈమెది అద్భుతమైన గాత్రం!’ అని కామెంట్ పెట్టారు.

అప్పటికే వైరల్ అయిన ఈ   గాయని వీడియోకి రెహమాన్ పోస్ట్ వల్ల సోషల్లో మరింత ఊపు వచ్చింది. లక్షల సంఖ్యలో వ్యూస్, వేల లైక్‌లు వచ్చాయి.