మహేష్ బాబు సినిమా `సర్కారు వారి పాట` చిత్రీకరణను వచ్చే జనవరి నుంచి అమెరికాలో ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. మహేష్ -పరశురామ్ బృందం ఇటీవలే షెడ్యూల్ ప్లాన్ ని డిక్లేర్ చేసేయగా.. ఐదారు రోజుల ముందే మహేష్ అమెరికాలో అడుగు పెడుతున్నారని కథనాలొచ్చాయి.
ఇక `సర్కారు వారి పాట` కోవిడ్ 19 అడ్డంకి వల్ల కాస్త ఆలస్యంగానే చిత్రీకరణకు వెళుతున్నా .. ఎట్టి పరిస్థితిలో ఉగాది కానుకగా సమ్మర్ బరిలో దించేయాలని ప్లాన్ చేస్తున్నారు. అందుకు తగ్గట్టే పకడ్భందీగా షెడ్యూల్స్ చిత్రీకరణ సాగనుందని సమాచారం.
ప్రతిదీ ప్రణాళిక ప్రకారం సాగితే ఉగాదికే రిలీజైపోతుంది. దీనికి తగ్గట్టే బిజినెస్ పరంగానూ సర్కారు వారి స్పీడ్ కొనసాగుతోంది. ఈ సినిమా ఇంకా ప్రారంభం కాకముందే బిజినెస్ పూర్తయిపోతుండడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇప్పటికే నాన్-థియేట్రికల్ ఒప్పందాలను వేగంగా పూర్తి చేస్తున్నారని సమాచారం. డిజిటల్ సహా శాటిలైట్ హక్కులు ఇప్పటికే అమ్ముడయ్యాయి. తమిళంలోనూ శాటిలైట్ హక్కులను విక్రయించారు. ఇతర భాషలలో శాటిలైట్ డబ్బింగ్ హక్కులను విక్రయించడానికి ప్రణాళికలు వేస్తున్నారు. ఇదంతా చూస్తుంటే సినిమాకి ఖర్చు చేయనున్న బడ్జెట్ మొత్తం ముందే నిర్మాతలు చేజిక్కించుకుంటారన్న ముందస్తు అంచనా ఏర్పడింది.
మహేష్ పారితోషికం లాభాల్లో వాటా ఏరియా హక్కులు ఇలాంటి వాటి విషయంలోనే తర్జన భర్జన సాగాల్సి ఉంటుందేమో! ఇక ఈ మూవీకి మహేష్ ఒక నిర్మాతగా ఉన్నారు కాబట్టి ప్రతిదీ జాగ్రత్తగా ఆచి తూచి ప్లాన్ చేస్తున్నారు. జీఎంబీ బ్యానర్ తో పాటు మైత్రి మూవీ మేకర్స్ – 14 రీల్స్ ప్లస్ సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్నాయి.
ఇందులో కీర్తి సురేష్ కథానాయికగా నటిస్తుండగా.. శ్రీమంతుడు కోసం పనిచేసిన మధీ ఛాయాగ్రహణం అందించనున్నారు. మహేష్ ఫేవరెట్ మ్యూజిక్ డైరక్టర్ తమన్ సంగీతం సమకూర్చనున్నారు.