సెట్ అయితే సాయి పల్లవి సుడి తిరిగినట్లే

ఫిధా తో సాయి పల్లవికు ఫిధా అయ్యిపోయారు తెలుగు కుర్రాళ్లు. దాంతో ఆమెను తమ సినిమాల్లో తీసుకోవాలని ప్రతీ దర్శకుడు, నిర్మాత ఉత్సాహం చూపిస్తున్నారు. అయితే సాయి పల్లవి మాత్రం ఆచి , తూచి అడుగులు వేస్తోంది. ఏ సినిమా పడితే అది ఒప్పుకోవటం లేదు. ముందుగా తన పాత్ర నచ్చాలి..అలాగే స్టార్ హీరో అయ్యిండాలి. మంచి బ్యానర్ ఉండాలి..ఇలా సవాలక్ష కండీషన్స్ ఉన్నాయి. దాంతో ఆమెను ఎప్రోచ్ అయిన చాలా మంది వెనతిరిగిపోయారు. అదే ఆమె కోరుకుంటోంది కూడా.

చిన్న సినిమాలు చేస్తే అక్కడే ఉండిపోతామని ఆమె గ్రహించి స్టార్స్ కోసం ఎదురుచూస్తోంది. ఆమె టైమ్ వచ్చినట్లుంది. మహేష్ బాబు త్వరలో చేయబోయే చిత్రంలో ఆమెను తీసుకోబోతున్నట్లు సమాచారం. ఈ మేరకు టాక్స్ నడుస్తాయట. ఇంతకీ ఎవరి దర్శకత్వంలో ఆ సినిమా ఉండబోతోంది అంటే…అనీల్ రావిపూడితో మహేష్ చేయబోయే చిత్రం కోసమే అంటున్నారు. ఇక సాయి పల్లవికు ఈ ప్రాజెక్టు ఓకే అయితే వరసపెట్టి తెలుగులో పెద్ద హీరోల నుంచి ఆఫర్స్ వస్తాయి. సుడి తిరిగినట్లే అంటున్నారు.

ఇప్పటికే అనీల్ రావిపూడి చెప్పిన యాక్షన్ కామెడీ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసారని, ఫుల్ బౌండ్ స్క్రిప్టుతో రమ్మన్నాడని సమాచారం. సాయి పల్లవి ని తమ సినిమాలో తీసుకుంటే ఖచ్చితంగా కొత్త కాంబినేషన్ అవుతుందని దర్శక,నిర్మాతలు భావిస్తున్నారట. అయితే ఫిధా తర్వాత సాయి పల్లవి సినిమాలు ఏమీ ఆడలేదు. కానీ రౌడీ బేబి సాంగ్ మాత్రం ఆమెకు ఎక్కడలేని క్రేజ్ తెచ్చిపెట్టింది. ఇప్పుడీ ఆఫర్ కూడా ఆ పాటే తెచ్చింది.