అక్కినేని మల్టీస్టారర్ నిజమా?
అక్కినేని నాగార్జున- రకుల్ ప్రీత్ నాయకానాయికలుగా `మన్మధుడు2` తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. చి.ల.సౌ ఫేం రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఆగస్టు 9న ప్రపంచవ్యాప్తంగా రిలీజవుతోంది. ఇప్పటికే రిలీజైన టీజర్.. ట్రైలర్ ఆకట్టుకున్నాయి. కింగ్ లేటు వయసులోనూ ఘాటైన రొమాన్స్ చేయడంపై ఫ్యాన్స్ లో సెటైర్లు పడుతున్నాయి. అయితేనేం ఏజ్ తో పనేంటి? అనుభవం వచ్చింది కదా? అని కింగ్ ఎంతో జోష్ చూపించారు తాజా ఇంటర్వ్యూలో. గీతాంజలిలో రెండున్నర నిమిషాల లిప్ లాక్ ని గుర్తు చేసి షాకిచ్చారు.
అదంతా అటుంచితే అక్కినేని కాంపౌండ్ హీరోలు ఓ మల్టీస్టారర్ లో నటించేందుకు రెడీ అవుతున్నారని ఇటీవల ప్రచారం అవుతోంది. అక్కినేని నాగచైతన్య – అఖిల్ హీరోలుగా నాగార్జున కామియోతో `మన్మధుడు 2` దర్శకుడు రాహుల్ రవీంద్రన్ ఓ మల్టీస్టారర్ కథ రెడీ చేస్తున్నారన్న ప్రచారం గుప్పుమంది. సోషల్ మీడియా వేదికగా దీనిపై చాలానే ఆసక్తికర చర్చ సాగుతోంది. అయితే ఇది నిజమేనా? ఆ మల్టీస్టారర్ ఎప్పుడు? అన్న ప్రశ్నకు తాజాగా రాహుల్ రవీంద్రన్ ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు.
ఈ ప్రచారం ఎలా మొదలైందో కానీ.. అసలు అలాంటి ఆలోచనే లేదని రాహుల్ రవీంద్రన్ అన్నారు. ప్రస్తుతం తన దృష్టి కేవలం `మన్మధుడు 2` ప్రమోషన్ పైనే. ఈ సినిమా రిలీజయ్యాకే తదుపరి ప్రాజెక్టుపై దృష్టి సారిస్తానని రాహుల్ తెలిపారు. గతంలోనూ మన్మధుడు 2 ప్రారంభానికి ముందు రాహుల్ పై రకరకాల డ్యామేజింగ్ వార్తలు వచ్చాయి. అతడు వినిపించిన స్క్రిప్టును నాగార్జున రిజెక్ట్ చేశారని.. రాహుల్ తో ప్రాజెక్ట్ ఉంటుందో లేదో? అన్న సందేహాన్ని వ్యక్తం చేస్తూ సామాజిక మాధ్యమాల్లో రకరకాల కథనాలొచ్చాయి. దానిపైనా రాహుల్ చాలానే నొచ్చుకున్నారు అప్పట్లో. తాజాగా మరోసారి అక్కినేని మల్టీస్టారర్ విషయంలోనూ రాహుల్ రవీంద్రన్ ఖంగు తిన్నారని అర్థమవుతోంది. ఇకపోతే అక్కినేని మల్టీస్టారర్ అంటే విక్రమ్.కె.కుమార్ తెరకెక్కించిన `మనం` గుర్తుకు వస్తుంది. ఒకవేళ అక్కినేని హీరోలంతా నటించాలనుకుంటే ఆ స్థాయి స్క్రిప్టు కుదిరితేనే పనవుతుంది. దీనికి కాలమే సమాధానం చెప్పాల్సి ఉంటుంది.