మెగాస్టార్ తో రోబో శంక‌ర్ పాన్ ఇండియా మూవీ

మెగాస్టార్ చిరంజీవి క‌థానాయ‌కుడిగా దేశం గ‌ర్వించ ద‌గ్గ ద‌ర్శ‌కుడు శంక‌ర్ కాంబినేష‌న్ లో సినిమాకు స‌న్నాహాకాలు జ‌రుగుతున్నాయా? పాన్ ఇండియా కేట‌గిరిలో ఈ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నారా? అంటే అవున‌నే స‌మాచారం. ఈ కాంబినేష‌న్ లో ఓ సినిమా చేస్తే బాగుంటుంద‌ని మెగా అభిమ‌నులు ఎప్ప‌టి నుంచో వెయిట్ చేస్తున్నారు. శంక‌ర్ ఎలాంటి స్క్రిప్టు తీసుకున్నా అందులో ఓ సందేశం ఉంటుంది. క‌మ‌ర్శియ‌ల్ అంశాలు పుష్క‌లంగా ఉంటాయి. భారీ త‌నం నిండిన విజువ‌ల్స్ తో బాక్సాఫీస్ షేక్ చేయ‌డం శంక‌ర్ స్పెషాలిటీ. స‌రిగ్గా ఇప్పుడు మెగాస్టార్ కోసం శంకర్ అలాంటి స్క్రిప్టునే సిద్దం చేయ‌బోతున్నారన్న వార్త కోలీవుడ్ స‌హా టాలీవుడ్ లోనూ హాట్ టాపిక్ గా మారుతోంది.

ఈ చిత్రాన్ని నిర్మించ‌డానికి బ‌డా కార్పోరేట్ సంస్థ‌లు ముందుకొస్తున్నాయ‌ట‌. రిల‌య‌ర్స్ ఎంట‌ర్ టైన్ మెంట్స్… సోనీ పిక్చ‌ర్స్ తో పోటీ ప‌డుతున్న‌ట్లు కోలీవుడ్ మీడియాలో ఓ వార్త హ‌ల్చ‌ల్ చేస్తోంది. మ‌రి ఈ వార్తల్లో నిజం ఎంత‌? అన్న‌ది తెలియాల్సి ఉంది. ప్ర‌స్తుతం శంక‌ర్ `ఇండియ‌న్ -2` తెర‌కెక్కిస్తున్నారు. భార‌తీయుడు సీక్వెల్ గా తెర‌కెక్కుతోన్న సినిమాలో క‌మ‌ల్ హాస‌న్ హీరోగా న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. 2.0 త‌ర్వాత శంక‌ర్ తెర‌కెక్కిస్తున్న చిత్ర‌మిది. ఆ సినిమా సెట్స్ లో జ‌రిగిన ప్ర‌మాదం స‌హా లాక్ డౌన్ కార‌ణంగా షూటింగ్ నిలిచిపోయింది. ఇటు మెగాస్టార్ కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో ఆచార్య‌లో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే.

ఈ రెండు సినిమాలు పూర్త‌వ్వ‌గానే చిరు-శంక‌ర్ కాంబినేష‌న్ పై ఓ క్లారిటీ వ‌చ్చే అవ‌కాశం ఉంది. అయితే గ‌తంలో చిరంజీవి శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన `జెంటిల్ మేన్` హిందీ రీమేక్ లో న‌టించారు. శంక‌ర్ ట్యాలెంట్ గురించి చిరంజీవి…..మెగా యాక్టింగ్, డాన్స్ స్కిల్స్ గురించి శంక‌ర్ ఒకరినొక‌రు ప్ర‌శంసించుకున్న సంద‌ర్భాలు కోకొల్ల‌లు. మ‌రి అలాంటి జోడీ క‌లిసి ప‌ని చేస్తే ఎలా ఉంటుందో చెప్పాల్సిన ప‌నిలేదు. ఇప్ప‌టికే మెగాస్టార్ సైరా న‌ర‌సింహారెడ్డి చిత్రంతో పాన్ ఇండియా స్టార్ అయ్యారు. అయితే ఆ సినిమా తెలుగులో బ్లాక్ బ‌స్ట‌ర్ అయినంత‌గా ఇరుగు పొరుగున కాలేక‌పోయింది. భారీ అంచ‌నాల‌ను అందుకోలేక‌పోయింది. ఇక శంక‌ర్ కి ఉత్త‌రాదినా రోబో-2.0 చిత్రాల‌తో అద్భుత‌మైన ఫాలోయింగ్ ఏర్ప‌డింది. అందువ‌ల్ల చిరంజీవి-శంక‌ర్ కాంబినేష‌న్ కి భారీ క్రేజు ఉంటుంద‌న‌డంలో సందేహం లేదు. అయితే క‌రోనా క్రైసిస్ వల్ల సినీప‌రిశ్ర‌మ‌లు గ‌డ్డు ప‌రిస్థితుల్ని ఎదుర్కొంటున్నాయి. ఇలాంటి స‌మ‌యంలో భారీ బ‌డ్జెట్ల‌తో సాహ‌సాలు చేయ‌డం సాధ్య‌మేనా? అన్న‌దానికి కాలమే స‌మాధానం చెప్పాల్సి ఉంటుంది.