(సూర్యం)
సుకుమార్-రామ్ చరణ్ ల క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం ‘రంగస్థలం’. దాదాపు మూడు దశాబ్దాల కిందటి నేపథ్యంలో సుకుమార్ తెరకెక్కించిన ఈ చిత్రం అంచనాలను మించేసి భాక్సాఫీస్ రికార్డ్ లు బ్రద్దలు కొట్టేసింది. రామ్ చరణ్ కెరీర్ లోనే అత్యధిక కలెక్షన్స్ ను రాబట్టిన చిత్రంగా నిలిచింది. అలాగే వరల్డ్ వైడ్ గా 120కోట్ల షేర్ ను రాబట్టి నాన్ ‘బాహుబలి’ రికార్డ్ తో తెలుగులో అత్యధిక కలెక్షన్స్ సాధించిన చిత్రాల జాబితాలో రెండో స్థానంలో నిలిచింది. ఇంతలా సూపర్ హిట్టైన ఈ చిత్రం మరి బుల్లి తెరపై ఏ రేంజిలో హంగామా చేస్తుంది.
దాదాపు అందరూ థియోటర్ లో చూసేసారు కదా ఇంక బుల్లితెరపై చూసేదెవరు అనుకున్న వాళ్లు ఉన్నారు. తాజాగా ప్రముఖ టీవీ ఛానల్ మా టీవీలో ఈచిత్రాన్ని ప్రసారం చేశారు. రికార్డు స్థాయిలో ఈచిత్రం 19.5 టిఆర్పి రేటింగ్స్ ను రాబట్టి ఛానెల్ ను టాప్ స్లాట్ లో నిలబెట్టింది. సమంత హీరోయిన్ గా నటించిన ఈచిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మించింది.
తెలుగు సినిమా మరిచిపోయిన పల్లెటూరి నేపథ్యంలోకి వెళ్లి.. స్వచ్ఛమైన భావోదేవాద్వేగాలతో రూపొందిన ఈ సినిమా దీన్ని బట్టి బుల్లి తెర ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుందని అర్దమైంది. ఇదొక పల్లెటూరి నేపథ్యంలో సాగే సగటు మామూలు ప్రతీకార డ్రామా.
‘రంగస్థలం’లో కథాకథనాల కంటే కూడా ఎనభైల నాటి పల్లెటూరి వాతావరణాన్ని తెరపై ప్రతిబింబించిన తీరు.. ఆ లుక్ ఎక్కువ మెప్పిస్తాయి. ఈ విషయాలను ఆస్వాదించగలిగిన వాళ్లకు ‘రంగస్థలం’ ప్రత్యేకంగా అనిపిస్తుంది. వాళ్లే ఎక్కువ మంది ఉన్నారని ఈ సినిమాతో ప్రూవ్ అయ్యింది.