రిషి కపూర్ ఆకస్మిక మరణంతో బాలీవుడ్ షాక్ కి గురైన సంగతి తెలిసిందే. టాలీవుడ్ లోనూ ఆయన మరణంపై తీవ్ర విచారం వ్యక్తమైంది. చిరంజీవి – అమితాబ్ సహా పలువురు ఈ మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక తన తండ్రిగారు కాలం చేయడంతో రణబీర్ సైతం అంతే విచారంలో ఉన్నాడు. క్యాన్సర్‌తో ఆకస్మిక మరణం కపూర్ వంశాన్ని కుంగదీసింది.
అయితే ఒక చెడు జరిగాక ఆ కుటుంబంలో వెలుగు నిండాలంటే ఏదైనా శుభకార్యం జరగాలని పెద్దలు అంటుంటారు. అలాంటి ఘడియ కపూర్ కుటుంబంలో రానుందా? అంటే అవుననే బాలీవుడ్ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. రణబీర్ ప్రస్తుతం ఆర్.ఆర్.ఆర్ బ్యూటీ అలియా భట్ తో నిండా ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. దీపిక-కత్రినలతో బ్రేకప్ తర్వాత ఇక సిన్సియర్ గా ఆలియాని ప్రేమించి పెళ్లాడేందుకు ఫిక్సయిపోయాడని అభిమానులు భావిస్తున్నారు. ఇక రిషీ కపూర్ అంత్యక్రియల్లో రణబీర్ తో పాటు ఆలియా కూడా కనిపించింది. ఎంతో విచార వదనంతో మామ అంత్యక్రియల్లో పాల్గొంది.
రణబీర్ ఈ ఏడాది అలియాను వివాహం చేసుకోనున్నారని, దీని కోసం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని బాలీవుడ్ వర్గాలు తాజాగా చెబుతున్నాయి. రిషి అనారోగ్యంతో ఉన్నందున వివాహం పెండింగ్‌లో ఉంది ఇన్నాళ్లుగా.. అయితే ఒక విచారకర ఘటన తర్వాత అదే సంవత్సరంలోనే పెళ్లి జరిపిస్తే బావుంటుందని కుటుంబ సభ్యులు భావిస్తున్నారన్న గుసగుస వేడెక్కిస్తోంది.