“మా వంశంలో ఓ స్టార్ ఉదయించాడు-” రామానాయుడు 

32 సంవత్సరాల నాటి సంగతి .

1986 ఆగష్టు 14 న నిర్మాత డి. రామానాయుడు కుమారుడు వెంకటేష్ ను హీరోగా పరిచయం చేస్తూ నిర్మించిన “కలియుగ పాండవులు ” చిత్రం విడుదలైంది.

కె. రాఘవేంద్ర రావు ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. కుష్బూ హీరోయిన్ గా నటించింది. “కలియుగ పాండవులు “సినిమా అన్నివర్గాలవారికీ బాగా నచ్చింది. తన కుమారుడు హీరోగా  రూపొందిన సినిమా హిట్ కావడంతో రామానాయుడు గారు చాలా ఉత్సాహంగా వున్నారు.

రెండురోజుల తరువాత రామానాయుడు గారిని అన్నపూర్ణా స్టూడియోస్ లో కలిశాను. ఆయన గొంతు బొంగురు పోయింది. ఆయన్ని కారణం అడిగితె “ఫోన్లు  మాట్లాడి మాట్లాడి ఇలా అయ్యింది . కలియుగ పాండవులు సినిమాలో వెంకటేష్ నటన బాగుందని మెచ్చుకుంటూ ఒకటే  ఫోన్లు” అని చెప్పారు.

“వెంకటేష్ ను హీరోగా పరిచయం చేశారు. ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు. కలియుగ పాండవులు సినిమా విజయవంత అయినందుకు ఒక తండ్రిగా, నిర్మాతగా ఎలా ఫీలవుతున్నారు ?”

“మొదట్లో వెంకటేష్ ఎలా నటిస్తాడో అన్న అనుమానం ఉండేది. అయితే దర్శకుడు రాఘవేంద్ర  రావు మీదా నాకు నమ్మకం వుంది. అందుకే  నిచ్చింతగా వున్నా. అయితే  రష్ చూసిన తరువాత నమ్మకం రెట్టింపయ్యింది. నేను ఊహించినదానికన్నా బాగా చేశాడు.

నిర్మాతగా నా జడ్జిమెంట్ నిజమయ్యింది. ఇక తండ్రిగా అంటారా, మహాదానందంగా వుంది.  సినిమా చుసిన ప్రేక్షకులు, స్నేహితులు  అందరూ  సినిమా చాలా బాగుంది, వెంకటేష్ బాగా చేశాడు అని చెబుతుంటే ఆ సంతోషం ఏమని చెప్పను. ఇన్ని సినిమాలు తీసిన నిర్మాతగా చెప్పాలంటే ఇంతటి ఆనందం, ఇంతటి  అనుభూతి మాటల్లో చెప్పలేను. ఇవి మరచిపోలేని మధుర క్షణాలు.

వెంకటేష్ మా అబ్బాయి, ఒక నటుడుగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేశాను. అందరూ మనస్ఫూర్తిగా ఆదరిస్తున్నారు, ఆశీర్వదిస్తున్నారు. మా ఇంట్లో ఓ స్టార్  ఉదయించాడు ” ఆనందంగా చెప్పాడు రామానాయుడు.

“వెంకటేష్ కు మీరిచ్చే సలహా ఏమిటి ?”

“విజయానికి పొంగిపోకుండా  నిర్మాతగా జాగ్రత్త  పడమంటున్నా, నటుడుగా మరింత కష్టపడుతూ మరిన్ని విజయాలు సాధించామని తండ్రిగా కోరుకుంటున్నా ఇక ముందు నటించే ప్రతి సినిమాలోని తన పాత్రను జాగ్రత్తగా ఎంపిక చేసుకోమని హెచ్చరిస్తున్నా” అని చెప్పారు.

వెంకటేష్ తొలి సినిమా సందర్భంగా రామానాయుడు తన కుమారుడును ఇచ్చిన సలహా అది. 32 సంవత్సరాల తరువాత కూడా వెంకటేష్ అదే మంచితనంతో, అదే  శ్రమతో, విభిన్నమైన పాత్రలను ఎంపిక చేసుకుంటూ నట ప్రస్తానం కొనసాగిస్తున్నాడు . తండ్రి పేరు నిలబెడుతున్నాడు .

డిసెంబర్ 13 వెంకటేష్ జన్మదినం. 59 వ సంవత్సరంలో ప్రవేశించాడు. అహం, ఆడంబరంలేని విలక్షణ నటుడు విక్టరీ వెంకటేష్ .

-భగీరథ